CID Arrest Three Persons in Siemens Project Case: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టులో 241 కోట్లు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. పలువురిపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. తాజాగా ముగ్గుర్ని అరెస్టు చేశారు. సీమెన్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌బోస్, డిజైన్‌టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, స్కిలర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ముకుల్‌చంద్ర అగర్వాల్‌ను అరెస్టు చేసి విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వీరిని మచిలీపట్నం జైలుకు తరలించారు.
CID On Siemens siemens project: శేఖర్‌బోస్, ముకుల్‌చంద్ర అగర్వాల్‌ను దిల్లీలో, వికాస్ వినాయక్ ఖన్వేల్కర్‌ను ఫుణెలో శనివారం అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు.. వారిని విజయవాడకు తీసుకొచ్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒకప్పటి అధికారులు గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్, ఇతరులు వారి అధికారిక హోదాను దుర్వినియోగం చేసి సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్‌వేర్ ఎండీ శేఖర్‌బోస్, డిజైన్‌టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండీ వినాయక్ ఖన్వేల్కర్‌లతో కుమ్మక్కయ్యారని సీఐడీ ఆరోపిస్తోంది.
2015 జూన్ 30వ తేదీన జారీచేసిన జీవో4లో పొందుపరిచిన నియమ నిబంధనలకు విరుద్ధంగా సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ప్రభుత్వ 10 శాతం వాటాగా చెల్లించే నిధులను దుర్వినియోగం చేయాలనేలా కుమ్మక్కయ్యారని అభియోగం మోపింది. ప్రభుత్వం 10 శాతం వాటాగా చెల్లించిన 371 కోట్ల నిధుల్లో 241 కోట్లను వారి అనుబంధ డొల్ల కంపెనీలైన స్కిలర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్లెడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, పత్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, టాలెంట్ ఎడ్జ్ సంస్థల్లోకి మళ్లించుకున్నారని ఆరోపించింది. ప్రధానంగా స్కిలర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సింగపూర్‌కు..అక్కడి నుంచి ఆప్టస్ హెల్త్‌కేర్‌కు నిధులు హవాలా మార్గంలో వచ్చాయని అభియోగాల్లో తెలిపింది. వీటిలో ఆ సంస్థ సీఈవో జీవీఎస్ భాస్కర్ ప్రసాద్ కీలకంగా వ్యవహరించారని ఆరోపిస్తోంది.
ఇదీ చదవండి..