గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్(cm jagan) నివాసం పక్కన పేదలఇళ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పోలీసు బందోబస్తుతో అధికారులు రెండు రోజులుగా ప్రొక్లయిన్లతో ఇళ్లు కూల్చడాన్ని నిరసిస్తూ.. క్రిస్టియన్ డెమోక్రటిక్ మూమెంట్((christian democratic movement) నేతలు.. ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పోలీసులు బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయించడాన్ని.. తీవ్రంగా ఖండిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సీఎం నివాసం పక్కన అమరారెడ్డి కాలనీలో.. 30 ఏళ్లుగా పేదలు నివాసం ఉంటున్నారని, కాలనీ వాసులకు వేరే ప్రాంతంలో 100 గజాల పట్టా భూమి ఇస్తామని చెప్పారన్నారు.
ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఇళ్లను ఖాళీ చేయించడం అమానుషమని నేతలు తెలిపారు. వర్షాకాల సమయంలో 300 కుటుంబాలు.. ఇళ్లు ఖాళీ చేసి వారంతా ఎక్కడ తలదాచుకుంటారని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి కారణంగా పేదలు ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి స్థితిలో ఇళ్లు కూల్చితే వెంటనే ఇళ్లు ఎలా నిర్మించుకుంటారన్నారని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం , పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని లేఖలో తెలిపారు. ఇళ్లు ఖాళీ చేయించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీ వాసులకు కేటాయించిన స్థలంలో.. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలని ,అప్పటి వరకు వారి సొంత గృహాల్లో ఉండేలా ఆదేశాలివ్వాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: Night curfew: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ