కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల నిలిపివేతపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఈమేర లేఖ రాశారు. పశ్చిమ చిత్తూరు ప్రాంతంలో తీవ్ర తాగునీటి, సాగునీటి ఎద్దడి ఉందన్న ఆయన... కుప్పం, పలమనేరు నియోజకవర్గాల రైతులు, ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 90శాతం కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తయ్యాయని.... ఇంకా 50కోట్ల విలువైన పనులు మాత్రమే పెండింగ్ వున్నాయని పేర్కొన్నారు. మిగిలిన 10శాతం పనులు గత 13నెలలుగా పెండింగ్ లో ఉండటం బాధాకరమన్నారు.
ఒకవైపు కరోనా కష్టాలు, మరోవైపు తాగునీటి వెతలు, ఇంకోవైపు సాగునీటి కొరత స్థానికుల సహనానికి పరీక్షగా మారాయని చంద్రబాబు అన్నారు. ‘‘నీరు-ప్రగతి’’ పనులు నిలిపేయడం మరో అనాలోచిత చర్య అని చంద్రబాబు విమర్శించారు. గతంలో చేసిన పనులకు బిల్లులు నిలిపేయడం కక్ష సాధింపేనన్న ఆయన..., కొత్త పనులు చేసేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. సత్వరమే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులతో సహా అన్ని జిల్లాలలో పెండింగ్ నీటి పారుదల ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని డిమాండ్‌చేశారు. తక్షణమే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిచిపోయి, నియోజకవర్గ రైతులకు అందాల్సిన ఫలితాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన దిగుబడులు రాక, కనీస మద్దతు ధర లభించక టమాటా, కూరగాయల రైతులు, హార్టీకల్చర్, సెరికల్చర్ రైతులు అప్పుల్లో కూరుకు పోయారని వివరించారు. రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: నవంబరు నుంచి పోలవరానికి గేట్లు... సీఎం నిర్దేశం