పోలీసులు, ప్రభుత్వం కలిసి పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేయించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... గంజాయి సాగు ఎవరు చేస్తున్నారు.. పోలీసులు ఏం చేస్తున్నారని..? ప్రశ్నించారు.
'సాక్ష్యాధారాలు మేం ఇస్తామా..? పోలీసులు, ప్రభుత్వం కలిసి దాడులు చేయించారు. డీజీపీ కార్యాలయానికి మా కార్యాలయం ఎంత దూరం..? మా ఆఫీసుకు కిలోమీటర్ దూరంలోనే సీఎం నివాసం ఉంది. హద్దులు దాటితే ఎక్కడైనా నియంత్రణ కష్టం. దాడులు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయాలి. తెదేపా ఎదురుతిరిగితే పోలీసులు పారిపోవడం ఖాయం. ప్రజాస్వామ్యంపై దాడి జరిగితే ఇక పార్టీలు ఉంటాయా..? రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి' - చంద్రబాబు, తెదేపా అధినేత
కన్నెర్ర చేస్తే మీరు రోడ్లపై తిరగలేరు: చంద్రబాబు
'ఇలాంటి ఘటనలు విజయవాడలో ఎప్పుడూ జరగలేదు. పట్టాభి ఇంట్లో దాడి చేసినప్పుడు పాప మాత్రమే ఉంది. ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిజ్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అన్నీ రికార్డయ్యాయి.. ఎవరూ తప్పించుకోలేరు. మేం కన్నెర్ర చేస్తే మీరు రోడ్లపై తిరగలేరు. ఇప్పటికే పోలీసు వ్యవస్థకు కళంకం తెచ్చారు. పోలీసు సహకారం లేకుండా పార్టీ ఆఫీసుపైకి వస్తారా?' - చంద్రబాబు, తెదేపా అధినేత
పట్టాభి ఇంటిపై దాడి.. ఏం జరిగిందంటే..
ఇవాళ ఉదయం పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశం(pattabhi press meet)లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు(nakka anandbabu)కు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన వాడిన భాషపై వైకాపా శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. విజయవాడలోని పట్టాభి ఇంటిపై దాడితో పాటు... మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. వివిధ జిల్లాల్లోని కార్యాలయాలపై దాడికి తెగబడ్డారు.
ఇదీ చదవండి