అమరావతి రైతులు ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఐకాస చేపట్టే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలంతా ఈ పోరుకు సంఘీభావం తెలపాలని కోరారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన..ఏడాదిగా పట్టువీడకుండా అమరావతి రైతులు, రైతుకూలీలు చేస్తున్న పోరాటం ఓ చరిత్రగా అభివర్ణించారు. వారి ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఐకాస పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 13 జిల్లాల ప్రజా ప్రయోజనాల కోసం రాజధాని నిర్మాణానికి చేసిన 34 వేల ఎకరాల భూమి త్యాగం వృథా కారాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నో వేధింపులు తట్టుకుని రాజధాని రైతులు ఏడాదిగా రాజీలేని పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు.
తప్పుడు కేసులు, అక్రమ నిర్భందాలను తట్టుకుని పట్టువదలకుండా ఆందోళనలు కొనసాగించారని గుర్తుచేశారు. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగి ఉంటే 13 జిల్లాలకు 2 లక్షల కోట్ల సంపద సమకూరేదన్నారు. అన్ని జిల్లాల యువతకు ఉపాధి లభించే అవకాశాన్ని వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. విశాఖలో విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతూ బెదిరింపులు, వేధింపులు, సెటిల్‌మెంట్లతో భయాందోళలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో కర్నూలును గాలికి వదిలేశారని మండిపడ్డారు. అన్ని రంగాల్లోనూ వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న చంద్రబాబు...అమరావతి విధ్వంసం ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరినీ చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఇదీచదవండి