ప్రముఖ పండితులు, విద్యావేత్త, అనువాదకులు, తెలుగు భాష ఔన్నత్యాన్ని పాశ్చాత్యుతలకు చాటిచెప్పిన సాహిత్య పరిశోధకులు ఆచార్య వేల్చేరు నారాయణరావుకు.. ప్రతిష్టాత్మకమైన గౌరవ ఫెలోషిప్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ సమర్పించింది. విజయవాడ పీబీ సిద్దార్థ కళాశాల ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు మాదవ్ కోషిక్, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, తెలుగు సలహా మండలి సంచాలకులు కె.శివారెడ్డితో పాటు ప్రముఖ సాహితీవేత్తలు బి.తిరుపతిరావు, వకుళాభరణం రాజగోపాల్‌తో పాటు పలువురి సమక్షంలో ఈ ఫెలోషిప్‌ను అందజేశారు.
ప్రస్థానం ఇలా మొదలైంది:
శ్రీకాకుళం జిల్లా అంబఖండిలో 1931లో జన్మించిన వేల్చేరు నారాయణరావు.. సుమారు 20 ఏళ్లపాటు తెలుగు సాహిత్య అధ్యాపకుడిగా పనిచేశారు. 1971లో అమెరికా వెళ్లి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో కృష్ణదేవరాయ పీఠం విశిష్ట ఆచార్యుడిగా 40 ఏళ్ల పాటు తెలుగు భాషా సాహిత్యాలను బోధించారు. అక్కడి ఇతర విద్యాలయాల్లోనూ సేవలందించారు. భారతీయ మౌఖిక, సంప్రదాయ, సాహిత్య, సంస్కృతి, చరిత్రలపై అనేక పరిశోధనలు చేసి అధ్యయన ఫలితాలను వెలువరించారు. అల్లసాని పెద్దన మనుచరిత్ర, పింగళి సూరన కళాపూర్ణోదయం, పాల్కురికి సోమనాథుని బసవ పురాణం, నంది తిమ్మన పారిజాతాపహరణం వంటి కావ్య సాహిత్యం మొదలుకొని.. గురజాడ అప్పారావు కన్యాశుల్కం, చాసో కథలు, విశ్వనాథ నవలలు, వచన కవిత్వం వంటి వర్తమాన, ఆధునిక సాహిత్యం వరకు ఎన్నింటినో ఆంగ్లంలోకి అనువాదం చేశారు.
సాహిత్య పరిశోధకులకు మార్గదర్శి:
వెయ్యేళ్లపాటి సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి, అనువదించి.. ప్రపంచానికి తెలుగు సాహిత్యం పట్ల ఒక సమగ్రమైన అవగాహన ఇచ్చిన వ్యక్తిగా ఆచార్య వేల్చూరి నిలిచారు. కావ్యాలను అనువదించడంతోపాటు వాటి విశిష్టతను విశ్లేషించి అర్ధం చేసుకోవాల్సిన పద్ధతులను, సాహిత్య చరిత్రను కొత్త దృక్కోణం నుంచి చూడాల్సిన అవసరాన్ని అనుబంధంగా అందించారు. తద్వారా సాహిత్యాన్ని ఎలా చదవాలి? ఎందుకు చదవాలి? అనే విషయాలు తెలియజేసి.. భాషా సాహిత్య పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచారని సాహిత్య అకాడమీ అభిప్రాయపడింది.
తెలుగు భాషకు చావులేదు:
అకాడమీ అందించిన ఫెలోషిప్ తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందని వేల్చూరి అన్నారు. తాను తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటానని, తెలుగు భాషలోనే రచనలు సాగిస్తానని తెలిపారు. తెలుగు ప్రజలే చంపేస్తే తప్ప తెలుగు భాషకు ఎప్పటికీ మరణంలేదని అభిప్రాయపడ్డారు. చుట్టూ కనిపించే రైతులు, గ్రామీణులు ఎంతో స్పష్టమైన తెలుగు మాట్లాడుతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దృశ్య, ప్రసారసాధనాల్లో వినియోగిస్తున్న భాషలో స్పష్టత పెరగాలని సూచించారు.
ఇదీ చదవండి: