‘రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన అప్పులు, అవినీతితో పరాకాష్ఠకు చేరుకుంది. రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు. ఖజానాకు వస్తున్న రాబడి ఎక్కడికి వెళ్తోంది. ఆ నిధులను విదేశాలకు తరలిస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది..’ అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు. అనంతపురంలో బుధవారం భాజపా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ పోలీసులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి జగన్ ప్రభుత్వానిదని విమర్శించారు.
వైకాపా మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క కళాశాల అయినా కట్టారా? కనీసం రోడ్డు వేశారా అని ప్రశ్నించారు. ఏపీలో భాజపా ఎంపీ ఒక్కరు కూడా లేకపోయినా పలు సంక్షేమ పథకాలకు ప్రధాని మోదీ నిధులు ఇచ్చారన్నారు. భాజపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
జులై 4న మంగళగిరిలో ఎయిమ్స్ ప్రారంభం.. దేశంలో 6 ఎయిమ్స్‌లను ఏర్పాటు చేశామని, అందులో భాగంగా రాష్ట్రంలోని మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్‌ను జులై 4న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని మంత్రి శోభా కరంద్లాజే విలేకరులతో తెలిపారు.