రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు విదేశీ సంస్థల నుంచి తీసుకున్న రుణ అడ్వాన్సుల్లో రూ.960 కోట్లు (124.65 మిలియన్ డాలర్లు) ఇప్పటికీ ఖర్చు చేయలేదంటూ ఈ పథకాల అమలు, వ్యయంపై సమగ్ర వివరాలు తెలియజేయాలని కేంద్రం కోరింది. ఆరింటిలో నాలుగు ప్రాజెక్టుల గడువు ముగిసిపోయే సమయం సమీపిస్తున్నా ఆ నిధులు ఖర్చు చేయలేదని ప్రస్తావించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర ఆర్థికశాఖలోని విదేశీ వ్యవహారాల విభాగం ఉన్నతాధికారి లేఖ పంపారు. విదేశీ ఆర్థికసంస్థల నుంచి రుణం పొంది రాష్ట్రాలు చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రం సమీక్ష(state received foreign funds) నిర్వహించింది.
ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి అడ్వాన్సుగా చెల్లించిన మొత్తాలకు సంబంధించి తాజాగా కేంద్రం సమీక్ష సమావేశం నిర్వహించింది. ‘వివిధ ఏజెన్సీలు ఇచ్చిన రుణాల(foreign funds) వినియోగం తీరు ప్రోత్సాహకరంగా లేదు. పెద్దమొత్తంలో నిధులు మూలుగుతున్నాయి’ అని లేఖలో పేర్కొన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి పథకం ప్రాజెక్టు-1, రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు 24×7 విద్యుత్తు సరఫరా కోసం, గ్రామీణరోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు, కరవు నివారణ పథకం, ఏపీఐఏటీ ప్రాజెక్టులకు విదేశీ ఆర్థికసంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో మూడు ప్రాజెక్టుల గడువు 2022 జూన్, సెప్టెంబర్ నెలల్లో ముగియనుంది. నిధులు ఖర్చుచేసినట్లు లెక్కలిస్తేనే మిగిలిన రుణం దక్కుతుంది.
ఇప్పటివరకు విదేశీ ఏజెన్సీల నుంచి 432.07 మిలియన్ డాలర్ల అడ్వాన్సులు తీసుకోగా 124.652 మిలియన్ డాలర్లు ఖర్చు చేయలేదు. ఇవే ప్రాజెక్టుల్లో కొంతమేర పనులు పూర్తయినా బిల్లులు రాలేదంటూ గుత్తేదారులు ఆందోళన చేస్తున్నారు. రుణ అడ్వాన్సులకు రాష్ట్రప్రభుత్వ మ్యాచింగు గ్రాంటు కలిపి పనులు చేయాలి. కొన్నింటిలో గ్రాంటు జతచేయకపోగా, ఏజెన్సీలు ఇచ్చిన అడ్వాన్సుల మేరకు కూడా చెల్లింపులు సాగలేదు. దీంతో ఆయా మొత్తాలన్నీ ఇతర అవసరాలకు మళ్లించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం ఈ వ్యవహారంపై లేఖ(central letter to state on foreign funds) సంధించి పూర్తి నివేదిక కోరుతోంది.
ఇదీ చదవండి..
AP High Court: హైకోర్టులో ఐఆర్‌టీఎస్ అధికారి సాంబశివరావు అత్యవసర వ్యాజ్యం