సౌర విద్యుత్ నగరంగా మార్చేందుకు విజయవాడను కేంద్రం ఎంపిక చేసింది. ప్రతి ఇంటికి అవసరమైన విద్యుత్ కోసం ఏర్పాటు చేసే సౌర పలకలపై 40శాతం రాయితీ ఇవ్వనుంది. నగర పరిధిలోని వాణిజ్య భవనాలకూ ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించనుంది. ఇది విజయవంతమైతే దశలవారీగా మిగిలిన పట్టణాలకూ విస్తరించాలన్న ప్రతిపాదన ఉంది. నగరంలో 2, 3 కిలోవాట్లు వినియోగించే కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే సౌర పలకల ఏర్పాటుకు రూ.40వేలు ఖర్చవుతుంది. దీని ప్రకారం రూ.80వేల నుంచి రూ.1.20లక్షల వరకు వెచ్చిస్తే ఇంటికి అవసరమైన విద్యుత్ అందుతుంది.
ఇందులో 40శాతాన్ని కేంద్రం రాయితీగా అందిస్తుంది. అంటే కిలోవాట్‌కు రూ.16వేలు రాయితీగా అందుతుంది. ప్రస్తుతం గృహ వినియోగదారులకు రాయితీ పథకం అందుబాటులో ఉంది. ‘సౌర నగర’ ప్రాజెక్టులో భాగంగా వాణిజ్య భవనాలకూ ఈ పథకం వర్తిస్తుంది. వాణిజ్య భవనాలకు ఎంత రాయితీ ఇవ్వాలనే దానిపై కేంద్రం నిర్ణయించాల్సి ఉంది.
సుస్థిర విద్యుత్ వ్యవస్థ లక్ష్యంగా పథకం
వినియోగదారులకు నాణ్యమైన చౌక విద్యుత్ అందించేలా ఒక కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికోసం సాధించాల్సిన లక్ష్యాలు, అవసరమైన నిధులకు సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: 'కరోనా పరీక్షల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్'