కొవిడ్ స్వల్ప లక్షణాలతో నిన్న హోంఐసోలేషన్‌లోకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలటంతో కరోనా చికిత్స కొనసాగిస్తున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్న సీఎం ఆరోగ్య పరిస్థితిని.. ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ.రావు, ఇతర వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు.
కేసీఆర్ ఆరోగ్యంతో తిరిగిరావాలి..
కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలంటూ.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్యం త్వరలోనే కుదుటపడుతుందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆయన మరిన్ని సేవలందించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సీఎం త్వరగా కోలుకోవాలని ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలన్నారు. ప్రజల దీవెనలతో కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ప్రజల దీవెనలే కేసీఆర్‌కు శ్రీరామరక్ష అని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయనకున్న ఆత్మస్థైర్యమే కరోనాపై విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అభిమానుల ప్రత్యేక పూజలు
మరోవైపు కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ... రాష్ట్రవ్యాప్తంగా తెరాస నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. ఆలయాల్లో నిత్యం జరిగే పూజల్లోనూ కేసీఆర్‌కు ఆరోగ్యసిద్ధి చేకూరాలని అర్చనలు చేయాలని పూజారులకు సూచించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులు సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. బాలాలయంలో వైష్ణవ సంప్రదాయంగా.. పంచనారసింహులను ప్రతిష్టించి.. అభిషేకాలు చేశారు. సీఎం కేసీఆర్ పేరుతో పూజలు నిర్వహించి వేద మంత్రాలు పఠించారు.
అంజన్నకు ముడుపు
హైదరాబాద్ నాంపల్లిలోని దర్గాలో హోంమంత్రి మహమూద్ అలీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చొప్పదండి ఎమ్మెల్సీ సుంకె రవిశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి... ఆంజనేయస్వామికి ముడుపు కట్టారు. సంగారెడ్డి జిల్లా బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్, భావి పీఠాధిపతి సిద్దేశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో దత్తగిరి వైదిక పాఠశాల విద్యార్థులు హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏడుపాయల వనదుర్గ భవానికి ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నిజాంపేట చల్మెడలోని గాయత్రీమాత ఆలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో, బషీర్‌బాగ్ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం జరిపారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చదవండి: