రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల్ని సీఎం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గులాబ్ తుపాను బాధితుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెదేపా నాయకులతో చంద్రబాబు మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘గులాబ్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర దెబ్బతింది. ప్రజలకు ఆస్తి నష్టం జరిగింది. దాదాపు మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రహదారులు ఛిద్రమయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ అక్కడి ప్రజల్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. ‘ముఖ్యమంత్రికి ఇరిగేషన్ అంటే తెలియదు. నీరు వృథాగా పోతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. సోమశిల ఓవర్ ఫ్లో కావడం ఆయన అసమర్థతకు నిదర్శనం’ అని మండిపడ్డారు.
గాలి మాటలు తప్ప, చేసేది శూన్యు...
‘ప్రకృతి విపత్తుల సమయంలో తెదేపా సమర్థంగా పనిచేసింది. హుద్‌హుద్, తిత్లీ తుపానుల సమయంలో ప్రజల్ని అన్ని విధాలుగా ఆదుకున్నాం. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాం. రైతులకు తగిన నష్టపరిహారం అందించాం. వరి, చెరకు, పత్తి, వేరుసెనగ, పంటలకిచ్చే పెట్టుబడి రాయితీని హెక్టారుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచాం. తిత్లీ, పెథాయ్ తుపానుల కారణంగా దెబ్బతిన్న వరికి పరిహారాన్ని హెక్టారుకు రూ.20 వేలకు పెంచాం. మొక్కజొన్నకు రూ. 8 వేల నుంచి రూ.12,500, అపరాలు, పొద్దుతిరుగుడుకు రూ.6,250 నుంచి రూ.10 వేలకు పెంచాం. కొబ్బరి, జీడి రైతుల్ని ఆదుకున్నాం. తెదేపా అయిదేళ్ల పాలనలో పెట్టుబడి రాయితీ కింద రూ.3,759 కోట్లు విడుదల చేశాం. జగన్‌రెడ్డి మాత్రం పంటల బీమా, పెట్టుబడి రాయితీ చెల్లింపుల్లో రైతుల్ని దారుణంగా మోసం చేశారు. గాలి మాటలు చెబుతున్నారే తప్ప చేస్తున్నది శూన్యం’ అని విమర్శించారు. ‘ప్రజలకు తెదేపా శ్రేణులు అండగా నిలవాలి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహార అవసరాలు తీర్చడం, పరిహారానికి కృషి చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి’ అని సూచించారు.
మత్స్యకారులను ఆదుకోవడంలో విఫలం: అచ్చెన్నాయుడు
మత్స్యకారులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల ఉభయగోదావరి జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గతంలో తుపాను సమయంలో సీఎం గాలిలో ఏరియల్ సర్వే నిర్వహించి ఉత్తుత్తి హామీలు ఇచ్చారని, ఇప్పుడు తాడేపల్లికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి
DOLI: వర్షాలతో కొట్టుకుపోయిన రోడ్లు.. గిరిశిఖర ప్రజలకు తప్పని డోలి తిప్పలు