అంతర్వేది నూతన రథ నిర్మాణ పనులను టెండర్లు పిలవకుండానే అప్పగించటంపై అగ్నికుల క్షత్రియుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. "ఆలయం నిర్మించిన అగ్నికుల క్షత్రియులే రథం నిర్వహణ చేపడతారు. అగ్నికుల క్షత్రియులు తొలి పూజ చేసి రథం లాగడం 200 ఏళ్లుగా వస్తోంది. రథం నిర్మాణంలో తమను గుర్తించట్లేదని వారు బాధ పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అర్థం చేసుకుని తక్షణమే స్పందించాలి" అని చంద్రబాబు వ్యాఖ్యనించారు.
రథాన్ని స్వామివారి ప్రతిరూపంగా భావించే ఈ అగ్నికుల క్షత్రియులే... 1823లో అంతర్వేది ఆలయాన్ని నిర్మించారన్నారు. ఆలయ నిర్వహణ కోసం 1800 ఎకరాల భూమిని ఇచ్చారన్న సంగతి మర్చిపోకూడదని హితవు పలికారు.
తక్షణమే టెండర్లు ఆహ్వానించాలి
టెండర్లు పిలవకుండా రథ నిర్మాణం ప్రారంభించి అంతర్వేదిలో అగ్నికుల క్షత్రియుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించడం మాని నూతన రథ నిర్మాణం కోసం తక్షణమే అధికారులు టెండర్లు ఆహ్వానించాలని కోరారు. రథనిర్మాణంలో స్థానిక అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యత ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు. కోటి రూపాయల రథం తగలబడితే.. దేవుడికి నష్టం ఏంటి అని భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైకాపా ప్రభుత్వ వ్యవహారశైలిలో మార్పు రాలేదని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: