సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను అసభ్యకరంగా దూషిస్తూ, వారిచ్చిన తీర్పులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. వైకాపా సోషల్ మీడియా విభాగం ఇన్‌ఛార్జి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిని విజయవాడలో సోమవారం దాదాపు ఏడు గంటల పాటు విచారించింది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరైన ఆయన తిరిగి రాత్రి 9 గంటలకు బయటకు వచ్చి విలేకర్లతో మాట్లాడారు.
‘సీబీఐ కేసుల్లో నేను నిందితుడిగా లేను. పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జిని కనుక కొన్ని వివరాలు తెలుసుకునేందుకు నన్ను పిలిచారు. వారి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పార్టీ సామాజిక మాధ్యమ విభాగం కార్యకర్తలపై 647 కేసులు పెట్టారు. అప్పుడే భయపడలేదు. ఇప్పుడూ భయపడబోం. న్యాయస్థానాలు, వ్యవస్థల పట్ల మాకు అపార గౌరవం ఉంది. వాటికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. చంద్రబాబు, ఆయన ఆధ్వర్యంలోని కొందరు అన్యాయంగా కేసులు పెట్టించారు. కేసుల్లో ఉన్న వైకాపా సామాజిక మాధ్యమ విభాగం కార్యకర్తలందరికీ అవసరమైన న్యాయసహాయం, అందిస్తాం’ అని చెప్పారు. దేవేందర్‌రెడ్డి విచారణకు వచ్చేటప్పుడు వైకాపా ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు ఆయనతో ఉన్నారు. విచారణ అనంతరం దేవేందర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతున్నప్పుడూ మల్లాది విష్ణు పక్కనే నిలబడ్డారు. విచారణ జరుగుతున్నంతసేపు పలువురు వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ అక్కడే వేచి ఉన్నారు.
ఇదీ చదవండి..
Defamation Case: పరువునష్టం దావా కేసు..ఎంపీ విజయసాయికి ఏబీవీ లీగల్ నోటీసులు