ఓ భూ వివాదానికి సంబంధించి ఆర్డీవో సహా రెవెన్యూ, పోలీసులు మొత్తం 17 మందిపై (Cases against 17 people) తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా (Suryapet district) చింతలపాలెం ఠాణాలో కేసు నమోదైంది. ఎస్సై రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం.. చింతలపాలెం మండలం గుడమల్కాపురం పరిధి సర్వే నంబర్ 43లో 12 ఎకరాలు తమదంటే తమదంటూ రెండు వర్గాల మధ్య వివాదం సాగుతోంది. తమ భూములకు హద్దులు నిర్ణయించాలని వారు అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. తేల్చకపోవడంతో ఇటీవల అదే గ్రామానికి చెందిన రమాప్రభాకర్ కోదాడ కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులో పేర్కొన్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించాలని కోర్టు ఆదేశించింది.
ఈక్రమంలో హుజూర్‌నగర్ ఆర్డీవో వెంకారెడ్డి, తహసీల్దార్ కృష్ణమోహన్, కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి, ఉపతహసీల్దార్ కమలాకర్, సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, ఆర్‌ఐ రామచంద్రయ్య, వీఆర్వోలు వెంకటేశ్వర్లు, దయాకర్, వీఆర్‌ఏ కొండలు, ఎస్సై రంజిత్‌రెడ్డి సహా 17 మందిపై సోమవారం కేసు పెట్టినట్లు ఎస్సై తెలిపారు. ఇందులో ప్రస్తుత ఎస్సై రంజిత్‌రెడ్డి తనపై తానే కేసు నమోదు చేసుకోవడం కొసమెరుపు.
ఇదీ చూడండి:
వైకాపా నాయకుల దౌర్జన్యం.. తండ్రీకుమారుడిపై ఇనుప రాడ్లతో దాడి