Case on R Krishnaiah: బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైకాపా రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆర్.కృష్ణయ్యపై కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన రవీందర్ రెడ్డి కృష్ణయ్యపై కీలక ఆరోపణలు చేస్తూ.. కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ పరిధిలోని తన భూమిని ఆర్.కృష్ణయ్య కబ్జా చేశారని రవీందర్ రెడ్డి ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. తన భూమిని కబ్జా చేయడంతో పాటుగా తనను చంపేందుకు కూడా కృష్ణయ్య యత్నించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరు రౌడీలను పంపి తనను బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఆర్.కృష్ణయ్యపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో.. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్స్టేషన్లో ఆర్.కృష్ణయ్యతో పాటు మరికొందరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 384, రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
వైకాపా రాజ్యసభ అభ్యర్థిగా ఇటీవలే ఆర్.కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసిన నేపథ్యంలో.. మొత్తం 4 స్థానాలకు 4 నామినేషన్లే వచ్చాయి. పరిశీలన తర్వాత 4 దరఖాస్తులు సక్రమంగా ఉన్నట్లు ఈసీ పేర్కొంది. ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఈసీ కాసేపట్లో ప్రకటించనుంది.
ఇవీ చూడండి