కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతున్న ఈ సంక్లిష్ట సమయంలో వైద్యులపట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని రాష్ట్ర కార్డియోలాజికల్ సొసైటీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 5 నెలలనుంచి కొవిడ్ మహమ్మారి అనేక మందిని ఇబ్బందులకు గురిచేసిందని.. 3 నెలల నుంచి వైద్య సౌకర్యాలు పెరిగాయని లేఖలో పేర్కొన్నారు. వైద్య సదుపాయాల మెరుగు, పడకల సౌకర్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జులై 17న హోటళ్లు, వసతి గృహాలు, ఆడిటోరియాలు వంటి వాటిని కొవిడ్ కేర్ సెంటర్లుగా వినియోగించుకునేందుకు మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. దీనివల్ల ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై ఒత్తిడి తగ్గి.. ఎక్కువ మందికి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొవిడ్ చికిత్సా కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 10 మంది చనిపోవడం ఆవేదన కలిగించే అంశం అన్నారు. కరోనా బాధితులు కోలుకునేలా చికిత్స అందించేందుకు వైద్యులు తమ జీవితాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారన్నారు. ఈ తరుణంలో ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై చర్యలు తీసుకోవడం కలవరపరుస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. కొవిడ్ రోగులకు వైద్యసేవలు అందిస్తోన్న రమేష్ ఆసుపత్రి యాజమాన్యానికి తాము మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రైవేటు కోవిడ్ చికిత్సా కేంద్రం ప్రాంగణమైన స్వర్ణ హోటల్ 21 మీటర్ల పొడవైందని... పురపాలక చట్టం, ప్రభుత్వం 2017లో జారీ చేసిన ఉత్తర్వులు 1119 ప్రకారం అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ పరిధిలో ఉంటుందని అన్నారు. విద్యుత్ ప్రమాదాలను పర్యవేక్షించాల్సింది వైద్యులు కాదని... పర్యటకులు, క్వారంటైన్ రోగులు చాలా కాలం నుంచి ఈ హోటల్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని అన్నారు. కరోనా విజృంభిస్తున్న ఆపత్కాల సమయంలో ఆరోగ్య సిబ్బందిపై కఠిన చర్యలకు పాల్పడకుండా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్రశాఖ అధ్యక్షుడు డాక్టర్ పి.వి.రాఘవశర్మ, కార్యదర్శి డాక్టర్ కార్తీక్ తుమ్మల తమ లేఖలో సీఎంకు విజ్ఞప్తి చేశారు..
ఇవీ చదవండి..