రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించిన తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో సర్కార్ వైద్యాన్ని బలోపేతం చేసే దిశగా హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ ఆసుపత్రిని ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తూ సూపర్ స్పెషాలిటీగా అధునీకరించాలని నిర్ణయించింది. దీనికి తోడుగా మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది. చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో ఒకటి, గడ్డి అన్నారం నుంచి తరలించిన పండ్ల మార్కెట్ ప్రాంగణంలో మరొకటి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మరొకటి మొత్తం టిమ్స్‌తో కలిపి నాలుగు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.
మార్కెట్ ఆధునీకీకరణ..
కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌గా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కేబినెట్ అభినందనలు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు, కరోనా కష్టకాలంలోనూ ధాన్యం సేకరణను రికార్డు స్థాయిలో జరిపిన పౌర సరఫరా, గ్రామీణాభివృద్ధి అధికారులను, సిబ్బందిని కేబినెట్ అభినందించింది. రాష్ట్రంలో గత ఏడాది ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నుల పై చిలుకుగా ఉందని, వ్యవసాయ శాఖ కేబినెట్‌కు తెలిపింది. గత సంవత్సరంలో పండిన వరిధాన్యంలో 1.4 కోట్ల వరి ధాన్యాన్ని సేకరించామని మార్కెటింగ్ శాఖ వివరించింది. 1.6 కోట్ల టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొన్నారని పేర్కొన్నారు.
రూ.5,145 కోట్లు జమ..
ఈ వానాకాలానికి సంబంధించి ఇప్పటికే రూ.5,145 కోట్ల రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. యాదవులకు గొర్ల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణుల కోసంగ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గీత కార్మికులకు త్వరితగతిన బీమా అందించడానికి చర్యలు తీసుకోవాలని, మత్స్య కార్మికులకు, గీత కార్మికులకు అందించాల్సి ఉన్న ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. వివిధ వృత్తి కులాలకు ఎంబీసీ కార్పొరేషన్ కు నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆదేశించింది. రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే... వృత్తి కులాలకు సత్వరమే బీమా చెల్లింపులు అందేలా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ అధికారులకు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'ఇంటి పన్ను పెంపుపై కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు'