SOMU VEERRAJU: యువ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భాజపా యువ సంఘర్షణ యాత్ర చేపట్టనుంది. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి ఒకేసారి అన్ని చోట్లా బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. 2వ తేదీన తిరుపతి నుంచి రాయలసీమవైపు ఒక యాత్ర, తిరుపతి నుంచే నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ వైపు మరో ర్యాలీ, మచిలీపట్నం నుంచి ప్రారంభమై ఉభయగోదావరి జిల్లాల మీదుగా రాజమహేంద్రవరం వరకు ఇంకో ర్యాలీ, ఉత్తరాంధ్రలో మరొక ర్యాలీ నిర్వహిస్తారు. రాయలసీమలో 1900 కి.మీ, కోస్తాంధ్రలో 1,700 కి.మీ, గోదావరి జిల్లాల్లో 1,400 కి.మీ, ఉత్తరాంధ్రలో 1,400 కి.మీ యాత్ర సాగనుంది. అనంతరం విజయవాడలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ముఖ్య అతిథిగా హాజరై యాత్ర పోస్టర్, లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నాలుగు జోన్లలో యాత్ర చేపడతాం. భీమవరం సభలో ప్రధాని మోదీ .. ఆదివాసీల గురించే మాట్లాడారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదు. రాష్ట్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయి. కేంద్రం పేదలకు ఇచ్చే రెండో విడత రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. దీనిపై ఉద్యమం చేస్తాం. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా భాజపా ఎదుగుతోంది. తెలంగాణ, ఏపీలో అధికారం సాధించే దిశగా అడుగుల వేస్తాం’ అని అన్నారు. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్ మాట్లాడుతూ ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా జగన్ ప్రజల్ని మోసం చేశారు. యాత్రలో భాగంగా మోదీ సాయాలు.. జగన్ మోసాలను వివరిస్తాం’ అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: