స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అప్రజాస్వామిక విధానాలను అనుసరించిందని భాజపా రాష్ట్ర శాఖ ఆరోపించింది. ఎన్నికలను ఏకగ్రీవం చేయించుకోవడం నుంచి పోలింగ్ రోజున ఓటర్లను భయపెట్టే వరకు అన్నిచోట్ల తప్పుడు మార్గాలను అనుసరించిందని విమర్శించింది. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు అన్నింటిపైనా పూర్తి అధ్యయనం చేసి... పార్టీ ఆధ్వర్యంలో పోరాటం సాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ నేతృత్వంలో పార్టీ పధాధికారుల సమావేశం జరిగింది.
తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిని గెలిపించడమే లక్ష్యంగా జనసేనతో కలిసి పనిచేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఇప్పటి నుంచే తిరుపతిలో ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలన్నారు. వైకాపా, తెదేపా అభ్యర్ధులను గెలిస్తే వారికి ఓ సీటు పెరుగుతుందని.. అదే భాజపాను గెలిపిస్తే కచ్చితంగా కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుందని... అన్ని రంగాల్లో తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. అభ్యర్థి ఎంపికపై వస్తున్న ఆశావహుల పేర్లపై అభిప్రాయ సేకరణ జరిపినా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో పార్టీపై బురదజల్లేందుకు అన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని పదాదికారుల సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని... ఉద్యోగుల భద్రతకు ఏ మాత్రం ఇబ్బంది ఉండబోదనే అంశాన్ని కార్మికులకు వివరించాలన్నారు. విశాఖ ఉక్కుపై మద్దతు తెలియజేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు- వారి రాష్ట్రంలో నష్టాల్లోని పరిశ్రమలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని నేతలు ప్రశ్నించారు.
ఇదీ చదవండి