తెలంగాణలో భాజపా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను లక్ష మందితో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అక్టోబర్ 2న నిర్వహించే బహిరంగ సభకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరవుతారని తెలిపింది. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఉదయం పదిన్నరకు స్మృతి ఇరానీ, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి ప్రచార రథంలో పట్టణమంతా రోడ్ షో నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు అంబేద్కర్ సెంటర్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశ పాదయాత్ర విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజానికానికి బండి సంజయ్ ధన్యావాదాలు తెలుపనున్నారు. తొలిదశ యాత్రలో ప్రజల నుంచి లభించిన స్పందన, తెరాస వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణను బహిరంగ సభా వేదికగా ప్రజలకు వివరించనున్నారు.
హుజూరాబాద్‌లో నిర్వహించాలనుకున్నా..
ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడడటంతో బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించాలని కమల దళం నిర్ణయించింది. హుస్నాబాద్(Husnabad)లో నిర్వహించనున్న సభను విజయవంతం చేసి తమ సత్తా చాటాలని ఇప్పటికే కార్యాచరణ కూడా ప్రారంభించేసింది. ముందుగా హుజూరాబాద్‌లో ముగింపు సభ నిర్వహించాలనుకున్నా.. షెడ్యూల్ వెలువడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి (Pramuk Manohar reddy) తెలిపారు. వచ్చేనెల 2 వరకు సిద్దిపేట జిల్లాలోనే బండి సంజయ్ తన ప్రజా ఆశీర్వాద పాదయాత్రను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.
34వ రోజు కోహెడ మండలంలో..
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 34వ రోజు కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కోహెడ మండలం శ్రీరాములపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చేరుకున్న బండి సంజయ్ పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులు బండి సంజయ్‌కి తెలిపారు. సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన బండి సంజయ్.. తన ఎంపీ నిధుల నుంచి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులతో కలిసి కాసేపు బండి సంజయ్ ముచ్చటించారు.
ఇదీ చూడండి: Punjab news Live: పంజాబ్ సీఎంతో సిద్ధూ భేటీ.. రాజీనామాపై వెనక్కి?