APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ 998 అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిస్తే.. 70 బస్సులకు మాత్రమే అంచనా కంటే తక్కువ ధరకు గుత్తేదారులు బిడ్లు దాఖలు చేశారు. దీంతో తొలుత వీటికి అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్దె బస్సుల కోసం ఏప్రిల్ 20న టెండర్లు పిలిచారు. వీటి గడువు మే 5తో ముగియాల్సి ఉండగా, తక్కువ బిడ్లు రావడంతో మే 20 వరకు పెంచారు. 419 బస్సులకు 850 బిడ్లు వచ్చాయి.
గత నెల 30, 31 తేదీల్లో రివర్స్ బిడ్డింగ్ నిర్వహించారు. ఇందులో ఆయా రూట్లు, బస్ సర్వీసు బట్టి కి.మీ.కు ఎంత చొప్పున చెల్లించాలనే దానిపై ఆర్టీసీ ముందుగా అంచనా వేసిన ధర కంటే 70 బస్సులకు గుత్తేదారులు తక్కువకు కోట్ చేశారు. 349 బస్సులకు మాత్రం ఎక్కువ మొత్తానికి కోట్ చేశారు.
అంచనా కంటే తక్కువ మొత్తానికి కోట్ చేసిన గుత్తేదారులతో ఆర్టీసీ యాజమాన్యం నియమించిన అధికారుల కమిటీలు చర్చలు జరిపి, ఇంకా ఏమైనా ధర తగ్గిస్తారేమోనని చర్చలు జరుపుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో వీరికి టెండరు ఖరారు చేస్తూ ఆదేశాలు ఇవ్వనున్నారు.
ఆ ధరలతో నష్టమే.. ఆర్టీసీ వేసిన అంచనా కంటే తక్కువ మొత్తానికి టెండరు దక్కించుకొని బస్సులు నడిపితే నష్టమేనని చాలాకాలంగా అద్దె బస్సులు నడుపుతున్న యజమానులు పేర్కొంటున్నారు. కొందరు అవగాహన లేక, పోటీ పడి తక్కువ ధరకు వెళ్లారని.. దీని వల్ల ఎక్కువ కాలం ఆ బస్సులు నడపటం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.