పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం జీవో ఇస్తే కేసీఆర్ స్పందించలేదని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో 25 లక్షల ఎకరాలు ఎడారిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు టెండర్ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి అఫెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహిస్తామని కేంద్ర జలసంఘం ముందుకొస్తే.. కేసీఆర్ వాయిదా వేయాలని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
డీజీపీ స్పందించలేదు..
రాష్ట్రంలో అత్యంత దయనీయమైన పరిస్థితులున్నాయని భట్టి విక్రమార్క విమర్శించారు. ఎస్సీలపై దాడులు ఆగడం లేదని..వారికి రాజ్యాంగ రక్షణ కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినా డీజీపీ, ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఎస్సీలపై దాడుల గురించి ఈ-మెయిల్ ద్వారా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
కరోనా విజృంభణ
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా విపరీతంగా విజృంభిస్తోందని భట్టి ఆరోపించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో హోంక్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సర్కారు ఆస్పత్రుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ లేక అధిక బిల్లులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: విశాఖలో మరో పేలుడు... తప్పిన పెను ప్రమాదం