తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాలో మొత్తం 461 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 554 చౌకధర దుకాణాలు, 2,33,951 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. జిల్లాలో ఆహార భద్రత కార్డులున్న కుటుంబాల్లో 18 ఏళ్లు దాటిన మహిళలు 2,92,514 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి బతుకమ్మ ఉత్సవాల కంటే ముందు నుంచే చీరలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లాలోని మహిళలకు ఏటా సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల నుంచి చీరలను సరఫరా చేస్తోంది. ఈనెలాఖరులోపు జిల్లాకు బతుకమ్మ చీరలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. వీటిని నిల్వ చేయడానికి తిమ్మాజిపేటలో గోదామును ఎంపిక చేశారు. ఇక్కడి నుంచి జిల్లాలోని మండలాలకు సరఫరా చేస్తారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా చీరలను అందించారు. ఈసారి కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు గుంపులు గుంపులుగా నిలబడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మహిళలకు చీరలను ఎలా పంపిణీ చేస్తుందో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావల్సి ఉందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
వివరాలు పంపించాం : రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో 2,92,514 మంది మహిళలు అర్హులు ఉన్నట్లు గుర్తించి వివరాలు పంపించాం. జిల్లాకు ఈనెల చివరిలోపు బతుకమ్మ చీరలు వచ్చే అవకాశం ఉంది. వీటిని నిల్వ చేయడానికి తిమ్మాజిపేటలో గోదామును ఎంపిక చేశాం.
- మోహన్‌బాబు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, నాగర్‌కర్నూలు