రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు(banks) అనేక షరతులు, నిబంధనలను విధిస్తున్నాయి. ప్రభుత్వాలు గ్యారంటీగా ఉండి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు సమీకరించి వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేసేవి. ప్రభుత్వ రెవెన్యూ(revenue) రాబడి మొత్తంలో 90 శాతానికి మించకుండా రుణాలు సమీకరించుకునే వీలుండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ గ్యారంటీలు మాత్రమే చూపిస్తే రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు ససేమిరా అంటున్నాయి. ఇందుకు ఇతరత్రా రూపాల్లో తనఖాలు, భరోసాలు కోరుకుంటున్నాయి. తాజా ఉదంతాలూ ఇందుకు నిదర్శనం.
10% ఆస్తుల తాకట్టు.. చెల్లింపులకూ ప్రత్యేక ఆదాయం
రుణ సంస్థలు ప్రభుత్వానికి అప్పు ఇవ్వాలంటే గ్యారంటీలతోపాటు అదనంగా ఆస్తులు తనఖా పెట్టాలని నిబంధన విధిస్తున్నాయి. మొత్తం రుణం విలువలో 10% ఆస్తులు తనఖా పెట్టాలంటున్నాయి. రుణాల చెల్లింపునకు ఉన్న ఆదాయ మార్గాలను తమకు చూపించాలని షరతు విధిస్తున్నాయి. దీంతో ఒక ప్రత్యేక ఆదాయాన్ని ప్రభుత్వం వారికే నేరుగా చెల్లించేలా ఎస్క్రో చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ నుంచి రుణ సమీకరణ ప్రారంభించారు. ఇందుకు 10 మద్యం డిపోల నుంచి అదనపు ఎక్సైజ్ సుంకాన్ని బ్యాంకులకు చెల్లించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఆస్తులనూ తనఖా పెట్టారు. ఈ కార్పొరేషన్ ద్వారా వచ్చే అప్పు అంతా సంక్షేమ కార్యక్రమాలకే.. అంటే నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే పథకాలకే మళ్లిస్తున్నారు. అంటే.. అది ఆస్తిని సృష్టించడం లేదు.
రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు ఇలా..
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.2,000 కోట్లతో పనులు చేపట్టాలని ప్రభుత్వం(govt) నిర్ణయించింది. ఇందుకు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకునేందుకు రోడ్డు రవాణా కార్పొరేషన్‌ను ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూపాయి సెస్‌గా విధించి అందులో 50% విలువను ఆర్థిక సంస్థలకు ఎస్క్రోగా చూపించవ్చని తెలిపింది. ఆ నిధులను నేరుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకే వినియోగించేలా భరోసా కల్పించి ఈ పనులను చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కార్పొరేషనూ ఆస్తుల తనఖా ప్రయత్నాలు ప్రారంభించింది.
కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికీ..
రాష్ట్రంలో కొత్తగా వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీటికి నిధులను సమీకరించేందుకు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి కార్పొరేషన్ పేరిట దీన్ని ఏర్పాటు చేశారు. దీనిద్వారా రుణాలను సమకూర్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.
రుణ పరిమితి పెంపునకు చక్కర్లు
ఏటా కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు(reserve bank) వేలంలో పాల్గొని బహిరంగ మార్కెట్‌లో రుణాలను తెచ్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తొలి 9 నెలలకు రూ.20,000 కోట్ల రుణాలకు అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఇప్పటిదాకా రూ.14,000 కోట్ల రుణం తీసుకుంది. తొమ్మిది నెలల కాలానికి ఇచ్చిన పరిమితిలో దాదాపు 3 నెలల్లోనే 70% అప్పులు తీసుకుంది. దీంతో ఈ పరిమితిని పెంచాలని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు దిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత రాబడులతో నెట్టుకు రాలేని పరిస్థితుల్లో అప్పులు తప్పని స్థితిలో వివిధ మార్గాల్లో రుణాల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇదీ చదవండి: Permits Postponed: రాయలసీమ ఎత్తిపోతల పర్యావరణ అనుమతులు వాయిదా