Bank Employees Strike : బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల సమ్మె చేపట్టారు. రెండవ రోజు సమ్మెలో భాగంగా.. ఇవాళ ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ మూతపడ్డాయి.
కర్నూలు నగరంలో యూనియన్ బ్యాంకు ముందు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమ్మెలో భాగంగా కడప జిల్లాలోని బ్యాంకులన్నీ మూతపడ్డాయి. కడప ఏడు రోడ్ల కూడలిలోని కెనరా బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించి బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పాడేరు స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగులు నిరసన తెలిపారు. బ్యాంకు ముందు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. విజయవాడలోని వన్ టౌన్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ వద్ద బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇదీ చదవండి : Employees on Fitment: ఫిట్‌మెంట్‌పై సీఎం దగ్గరే తేల్చుకుంటాం: ఉద్యోగ సంఘాల నాయకులు