విజయవాడ సత్యనారాయణపురంలోని చిత్తరంజన్ గ్రంథాలయంలో 'చదవటం మాకిష్టం' కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషన్, గ్రంథాలయ పరిషత్ పర్సన్ ఇన్‌ఛార్జి వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర పథక సంచాలకులు కే. వెట్రిసెల్వి, గ్రంథాలయశాఖ సంచాలకులు డీ. దేవానందరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్ధులకు కావాల్సిన కథల పుస్తకాలను పాఠశాలల నుంచి గ్రంథాలయాల వరకు అన్నింటా అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రతి విద్యార్ధి చదవడాన్ని ఇష్టంగా భావించాలని అన్నారు. కనీసం వారానికి ఒక పుస్తకం చదివితే ఏడాదిలో పుస్తకపఠనంపై ఆశక్తి పెరిగి మరింత ఇష్టంగా పుస్తకాలు చదువుతారని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్ధులు తెలుగు, ఆంగ్ల భాషల్లో కథల పుస్తకాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. విద్యార్ధులు అవి వారి హక్కుగా భావించి ఉపాధ్యాయుల నుంచి తీసుకుని చదవాలని... అప్పుడే వారిలో విజ్ఞానం పురోగతి చెంది ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఒక్క పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు అందరికీ అందుబాటులో ఉండే తేలికైన మార్గం పుస్తక పఠనమని చెప్పారు. గ్రంథాలయాలు, పాఠశాలలు విద్యావ్యవస్థకు రెండు కళ్లని పేర్కొన్నారు.
పిల్లలతో పుస్తకాలను చదివించిన విద్యాశాఖ అధికారులు తమ ప్రసంగాల్లో పుస్తకాలు, పత్రికలు, గ్రంథాలు, సాహిత్యం, ఇతిహాసాలు, విజ్ఞాన శాస్త్ర అంశాలపై ప్రచురితమైన వ్యాసాలు చదవడం వల్ల ఎలాంటి మేలు కలుగుతుందనే విషయాలను సమగ్రంగా వివరించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పుస్తక పఠన కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి గ్రంథాలయాల వరకు అన్నింటా నిర్వహిస్తామని తెలిపారు. పుస్తక పఠనంపై నానాటికీ విద్యార్ధుల్లో ఆసక్తి తగ్గుతున్నందునే విద్యాశాఖ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. 1913లో నోబెల్ బహుమతి పొందిన పండిట్ రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్‌లో రచించిన గీతాంజలి పద్య కావ్యానికి చలం అనువాదంలోని రెండు పద్యాలను చదివి వాటి గురించి వివరించారు.
పాఠశాలల్లో ఉండే గ్రంథాలయాల్లోని పుస్తకాలను రోజూ ఏదో ఒక సమయంలో విద్యార్థులతో చదివిస్తున్నామని తెలిపారు. పాఠ్య పుస్తకాలే కాకుండా.. విద్యార్థులకు బాహ్య ప్రపంచంపైనా అవగాహన పెంపొందించేందుకు ఈ పుస్తక పఠనం ఎంతగానో దోహదపడుతుందని విద్యాశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలో ఉన్న గ్రంథాలయాలకు చిన్నారులను తీసుకెళ్లి.. ఏదో ఒక పుస్తకాన్ని చదవాలని.. మున్ముందు పాఠశాలల రోజువారీ ప్రణాళికల్లో దీన్ని భాగం చేస్తామన్నారు.
విద్యార్థులును ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో 2 గంటలు గ్రంథాలయాలకు తీసుకెళ్లి.. కథలు, నవలలు సహా అన్ని రకాల పుస్తకాలను చదివించేలా చూడాలని వార్డు వలంటీర్లు, విద్యా కార్యదర్శులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
ఇవీ చదవండి: