komuravelli mallanna kalyanam 2021 : తెలంగాణలో కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం... మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల వివాహం జరుగుతుంది. వధువుల తరఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా.. వరుడి తరఫున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరిస్తారు. మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కల్యాణంతో ప్రారంభమవుతాయి.
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
komuravelli kalyanam in siddipet : మహారాష్ట్రలోని బృహన్మఠాదీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో జరుగుతున్న స్వామి వారి కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సాయంత్రం 7 గంటలకు కొమురవెల్లి మల్లన్న రథోత్సవం జరగనుంది. సోమవారం ఉదయం 9 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు లక్షబిల్వార్చన, మహా మంగళహారతి కార్యక్రమాలు జరగనున్నాయి.
సుందరంగా ఆలయం
komuravelli kalyanam arrangements : రెండు రోజులపాటు స్వామి కల్యాణ మహోత్సవం జరగనున్నందున.... కొమురవెల్లి మల్లన్న ఆలయ క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మల్లన్న కల్యాణమహోత్సవాలు జరుగుతున్నాయి. కల్యాణోత్సవానికి 25 వేలమందికిపైగా భక్తులు రావచ్చని అంచనా వేసిన అధికారులు... ఆ దిశగా ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో 4 చోట్ల వాహనాల పార్కింగ్, 4 చోట్ల స్నాన ఘట్టాలు సిద్ధం చేశారు. కొమురవెల్లి ఆలయ పరిసరాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వేకువజామునుంచే షురూ..
komuravelli mallanna Brahmotsavam : తెల్లవారుజాము నుంచే కల్యాణ క్రతువు ప్రారంభమైంది. ఉదయం 5 గంటలకు దృష్టికుంభం, బలిహరణం నిర్వహించారు. గర్భాలయం నుంచి ఊరేగింపుగా స్వామి, అమ్మవార్లను కల్యాణ వేదిక మీదకు తీసుకువచ్చారు. ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 7 గంటలకు రథోత్సవం జరుపుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న కల్యాణం తిలకించడానికి వస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాస్కు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. ఉచితంగా పంపిణీ చేయడానికి మాస్కులు సిద్ధం చేశారు. ఆలయ సిబ్బందికి ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించారు. భక్తుల కోసం దేవాలయం వద్ద ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు.
'ఈ వేడుకకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తాం. అధికారులందరూ టీకా తీసుకున్నారు. వ్యాక్సినేషన్ కూడా నిర్వహిస్తాం. ప్రత్యేక ఆరోగ్య శిబిరం కూడా ఏర్పాటు చేశాం. మల్లన్న భక్తుల సౌకర్యం కోసం సిద్దిపేట, గజ్వేల్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం.' - బాలాజీ, ఆలయ ఈవో