SC, ST Corporation Funds: ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాస్‌లతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు నిధులెప్పుడు ఇస్తారని ఈ సభలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులను కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ప్రశ్నించారు. సమావేశం ఆఖర్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు వందన సమర్పణకు సిద్ధమవుతున్నప్పుడు.. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి లేచి.. సభలో పాల్గొనాలని పిలిచిన అధికారులు తమకు మాట్లాడే అవకాశమివ్వకుండా కార్యక్రమం ఎలా ముగిస్తారని ప్రశ్నించారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.
మాల్యాద్రి మాట్లాడేందుకు రాగా.. మల్లాది విష్ణు అక్కడినుంచి లేచి వెళ్లారు. ఆయన వెనక మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కూడా వెళుతుండగా మాల్యాద్రి మాట్లాడారు. ‘మంత్రిగారూ.. పదవులు ఎన్ని రోజులుంటాయో తెలియదు. కనీసం దళితుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు వేదికపైనున్న వారు కృషి చేయాలి’ అని కోరారు. ఎస్సీ వసతిగృహాల్లో పరిస్థితిని అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు చూస్తే వాస్తవాలు తెలుస్తాయని మాల్యాద్రి సూచించారు. దీనిపై మంత్రి విశ్వరూప్ జోక్యం చేసుకొని సుదీర్ఘ వివరణ ఇచ్చారు. బడ్జెట్‌లో ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించలేదనేది అపోహేనని, దానికి రూ.7,214 కోట్లు కేటాయించామని అన్నారు. వీటిని ఎస్సీ ఉపప్రణాళికలో చూపించలేదని తెలిపారు. గతంలో కేవలం రాయితీనిచ్చి రుణాలు ఇవ్వకుండా లబ్ధిదారులను మోసం చేశారని వివరించారు.
ఇదీ చదవండి : CM Jagan: నేడు గవర్నర్ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి జగన్ భేటీ