APSEC alerts on cyber crime: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో నేరాలకు తెగబడుతున్నారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానానికి ఉద్దేశించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు-2021 ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో... ఆ అంశాన్ని అడ్డం పెట్టుకుని మోసాలకు తెరలేపారు. ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానించాలంటూ ఎన్నికల సంఘం పేరుతో లింక్‌లు పంపిస్తే అందరూ సులువుగా నమ్మేస్తారనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడను అవలంబిస్తున్నారు. గత రెండు, మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని చాలామంది సెల్‌ఫోన్లకు ఇలాంటి ఎస్‌ఎంఎస్‌లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అవి నిజంగా ఎన్నికల సంఘం పంపించిన సందేశాలేనా అని నిర్ధారించుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన 1950 కాల్‌సెంటర్‌కు రోజుకు సగటున 20-25 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ లింక్‌లపై క్లిక్ చేసి తాము మోసపోయామని కూడా కొందరు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు.
ఆ లింక్‌ను క్లిక్ చేయొద్దు
మోసపూరిత లింక్‌లను క్లిక్ చేస్తే నష్టపోవడం ఖాయం. ఆ లింక్ తెరవగానే సైబర్ నేరగాళ్లు కొన్ని స్పైవేర్‌లు, మాల్‌వేర్‌లను మన మొబైల్ ఫోన్లలోకి చొప్పించి వాటిని వారి ఆధీనంలోకి తీసుకుంటారు. మొబైల్ బ్యాంకింగ్‌లో లావాదేవీలు నిర్వహించినప్పుడు సెల్‌ఫోన్‌లో పొందుపరిచే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ వంటి వాటిని, డెబిట్, క్రెడిట్ కార్డుల క్రెడిన్షియల్స్‌ను తస్కరిస్తారు. వాటిని వినియోగించి బ్యాంకు ఖాతాలను కొల్లగొడతారు. కొన్ని సందర్భాల్లో సెల్‌ఫోన్‌లలోని వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి బెదిరింపులకు పాల్పడే అవకాశమూ ఉంది. లింక్‌లో పొందుపరిచే ఆధార్ కార్డు, వివరాలు ఆధారంగా కూడా వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
ప్రక్రియ పూర్తికి మరికొంత సమయం
ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానికి ఉద్దేశించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు-2021 ఈనెల 20న లోక్‌సభలో, 21న రాజ్యసభలో ఆమోదం పొందింది. చివరిగా రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే అది చట్టంగా రూపుదాలుస్తుంది. ఆ తర్వాతే విధివిధానాలు ఖరారవుతాయి. తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం కూడా ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు... అది స్వచ్ఛందమే. ఈ ప్రక్రియ అంతా పూర్తికావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. అంతలోపే సైబర్ నేరగాళ్లు ఆ పేరిట మోసాలకు తెగబడుతున్నారు.
1950 కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయండి
ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ మొదలైతే ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. రెవెన్యూ యంత్రాంగం ద్వారా ప్రచారం చేయిస్తాం. ఆధార్ అనుసంధానం కోసం ఇప్పటివరకు మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. సందేశాలు, లింక్‌లు పంపించట్లేదు. మీకు అలాంటి సందేశాలు వస్తే 1950 కాల్‌సెంటర్‌కు వెంటనే ఫిర్యాదు చేయండి. -కె.విజయానంద్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
ఇదీ చదవండి..
good governance ranks : గుడ్ గవర్నెన్స్ సూచీలో ఏపీ స్థానం ఎంతో తెలుసా..