TDP ON AMUL: 'అమూల్ వనరులు దోచుకునేది ఏపీలో..పెట్టుబడులు పెడుతున్నది మాత్రం తెలంగాణలో' అంటూ తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని సహకార డెయిరీలను దెబ్బకొట్టేందుకు తీసుకొచ్చిన అమూల్ పాల కంపెనీకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అడ్డమైన పన్నుల పేరుతో.. ఏపీలో ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసిన సొమ్ము రూ. 2,500 కోట్లను అమూల్‌కు ధారపోశారని మండిపడ్డారు. ఈ సొమ్ముతో అమూల్ సంస్థ తెలంగాణలో రూ. 500 కోట్లు వెచ్చించి.. భారీ డెయిరీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నా.. సీఎం జగన్ రెడ్డికి తలవంపుగా లేదా అని ఆయన నిలదీశారు.
సీఎం జగన్ ముఖం చూస్తే గేదెలు పాలిస్తాయా..?
రాష్ట్ర ప్రజల శ్రమను తెలంగాణలో పెట్టుబడిగా పెట్టిస్తున్నారని ఎద్దేవా చేసారు. ప్రాజెక్టును సొంత రాష్ట్రంలో ఎందుకు పెట్టించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగంతో విలవిల్లాడుతున్న యువతకు అమూల్ డెయిరీ ఏర్పాటు చేస్తే.. వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి లభించేదని అభిప్రాయపడ్డారు. అమూల్ డెయిరీ రాష్ట్రానికి రాకపోవడానికి జగన్ రెడ్డి చేతకానితమే కారణమని ఆరోపించారు. జగనన్న పాలువెల్లువ అంటే ఏమిటో ప్రజలకు అర్థం తెలపాలన్నారు. సీఎం జగన్ ముఖం చూడగానే.. గేదెలు పాలు ఎక్కువ ఇస్తాయా? ఇది జగనన్న పాలవెల్లువ కాదు.. పాడి రైతుల దోపిడి అని దుయ్యబట్టారు.
''ఐటీ దాడుల్లో పట్టుబడుతున్న డబ్బుకు మూలాలు ఏపీ మంత్రులే. ఇసుక, మద్యం మాఫియా పని మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఒక మంత్రి చెన్నైలో పట్టుబడితే, ఇంకో మంత్రి హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. వైకాపా నాయకుల లూటీకి అంతేలేకుండా ఉంది. ప్రభుత్వమే దోపిడీకి పాల్పడుతుంటే ప్రజలు ఎవరికి మొరపెట్టుకోవాలి. అధికార పార్టీ నేతలు అనేక చోట్ల ప్రభుత్వం ఖాళీ భూమి కనిపిస్తే డేగల్లా వాలి కబ్జా చేస్తున్నారు.'' - గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి
ఇదీ చదవండి: మమ్మల్ని అవమానిస్తున్నారు.. ప్రభుత్వ వైఖరి మారకపోతే ఉద్యమిస్తాం: ఉద్యోగ సంఘాల నేతలు