అనుభవం ఉన్నవారిని పార్టీకి ఎలా వాడాలో సీఎం జగన్‌కు తెలుసునని మంత్రి పేర్నినాని అన్నారు. పార్టీ అవసరాల మేరకు తమ అనుభవాలు వాడుకుంటామని సీఎం జగన్ చెప్పారన్నారు. అనుభవాలు, సామర్థ్యం మేరకు అవకాశాలు కల్పిస్తామని సీఎం వ్యాఖ్యనించారన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు 24 మంది మంత్రులు రాజీనామాలు అందించినట్లు తెలిపారు. కొత్త మంత్రులు ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని పేర్ని నాని వెల్లడించారు.
జగన్ ముందే చెప్పారు: రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గం మారుస్తామని సీఎం జగన్ ముందే చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎవరికి ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతగా నిర్వహిస్తామని సీఎంతో చెప్పామన్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తమ అందరి బాధ్యత అని అన్నారు. మంత్రివర్గంలో ఎవరిని కొనసాగించాలో సీఎం జగన్ నిర్ణయిస్తారని తెలిపారు. ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తామని అన్నారు. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంటుందని.., తెలిసి ఏ తప్పూ చేయలేదని అన్నారు.
కేబినెట్‌లో కొందరు సమర్థులు కావాలి: కేబినెట్‌లో కొందరు సమర్థులు కావాలని మంత్రి కొడాలి నాని అన్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే వ్యక్తులు కేబినెట్‌లో ఉండాలన్నారు. పార్టీలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో సీఎం జగన్‌కు తెలుసునని అన్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని.., ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తామని తెలిపారు. ఇప్పటివరకు ఎవరూ తీసుకోని నిర్ణయాలను జగన్ తీసుకున్నారని కొనియాడారు. పేద ప్రజల మేలు కోసం సీఎం జగన్ పనిచేశారని అన్నారు. తనపై ఎన్ని అభాండాలు పడినా ఎదుర్కొని ముందుకెళ్లారన్నారు. జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయంలో తమను భాగస్వామ్యం చేశారని కొడాలి అన్నారు.
"కేబినెట్‌లో ఐదారుగురు కొనసాగవచ్చని అనుకుంటున్నా. పార్టీ కోసం.. రాష్ట్ర ప్రజల కోసమే సీఎం నిర్ణయాలు. మైనార్టీలు, ఎస్టీలు, బడుగువర్గాలకు అన్ని విధాలా న్యాయం చేస్తున్నారు. బడుగువర్గాలకు ఉన్నత స్థానం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆశయం, సిద్ధాంతం కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారు. పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తామని సీఎం జగన్‌కు చెప్పాం. కేబినెట్‌లో మార్పులు ఉంటాయని గతంలోనే చెప్పారు. కేబినెట్‌లో 80-90 శాతం మార్పులు ఉంటాయని గతంలోనే చెప్పారు." -కొడాలి నాని, మంత్రి
నాకు మంత్రిపదవి కొనసాగే అవకాశాలు తక్కువ: సీఎం జగన్ ఆదేశం మేరకు మంత్రులంతా రాజీనామా సమర్పించినట్లు మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. సీఎం జగన్ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ పరమైన ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపారు. కొంతమంది మంత్రులు కేబినెట్‌లో కొనసాగుతారని వెల్లడించారు. ప్రస్తుత కేబినెట్‌లో ఐదారుగురు కొనసాగే అవకాశం ఉందన్నారు. తనకు మంత్రిపదవి కొనసాగే అవకాశాలు తక్కువ అని చెప్పారు. రాజీనామా విషయమై సీఎం జగనే ఎక్కువ బాధపడ్డారని అన్నారు. మీ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని సీఎం జగన్తో చెప్పామని వెల్లంపల్లి తెలిపారు.
ఇదీ చదవండి: 24 మంది మంత్రుల రాజీనామా.. ఈనెల 11న కొత్త కేబినెట్