సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8న ఇచ్చిన జీవో 36ను సవాల్ చేస్తూ పలు సినిమా థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై ఈనెల 9న అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి 9, 10, 11 తేదీల్లో ఎగ్జిబిటర్లు నిర్ణయించిన ధరకు విక్రయించుకునేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అత్యవసరంగా దాఖలు చేసిన అప్పీల్పై ధర్మాసనం విచారణ జరిపింది.
అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ నెల 8న జీవో జారీచేశాక కూడా సినిమా థియేటర్ల యజమానులు నిర్ణయించిన ధరల ప్రకారం 9, 10, 11 తేదీల్లో టికెట్లు విక్రయించేందుకు సింగిల్ జడ్జి ఉత్తర్వులివ్వడం సరికాదన్నారు. అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల ధరల విషయానికే సింగిల్ జడ్జి పరిమితం కాకుండా.. మూడు రోజుల పాటు యజమానులు నిర్ణయించిన ధరలకు విక్రయించుకునేందుకు వెనులుబాటు ఇచ్చారని గుర్తు చేశారు. థియేటర్ల యజమానుల తరఫున న్యాయవాది కె. దుర్గాప్రసాద్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు చాలా స్వల్పంగా ఉన్నాయన్నారు.
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ నెల 11 నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం టికెట్లు విక్రయించాలని స్పష్టం చేసింది. యాజమానులు నిర్ణయించిన ధరలతో ఈ నెల 10 వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారి విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశించింది.
ఇదీచదవండి
తిరుపతి ఉపపోరు: ఈసీకి తెదేపా లేఖ.. వైకాపాపై ఫిర్యాదు చేసిన అంశాలివే..!