విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏలూరు వింత వ్యాధి బాధితుల్ని వైద్యశాఖామంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఏలూరు నుంచి 25 మంది బాధితులు విజయవాడకు రాగా.. అందులో ఇద్దరు డిశ్ఛార్జ్ అయ్యారు. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన వాళ్లకు ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారన్నారని మంత్రి వివరించారు. మృతి చెందిన ఇద్దరు వింత వ్యాధితో చనిపోలేదని వైద్యులు నిర్ధారించినట్లు మంత్రి తెలిపారు. ఒకరు కొవిడ్‌తో , మరొకరు గుండెకు సంబంధించిన సమస్యలతో మృతి చెందారని తెలిపారు.
ఏలూరు బాధితుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ అవశేషాలు ఉన్నట్లు ప్రాధమిక పరీక్షల్లో నిర్ధరణ అయిందని మంత్రి అన్నారు. ఏలూరులో వాటర్ ట్యాంక్ లను క్లోరినేషన్ చేస్తున్నామని .. ప్రజల భయపడాల్సిన అవసరం లేదన్నారు. వాటర్ కంటామినేషన్ ఇప్పటి వరకు పరీక్షల్లో నిర్ధరణ కాలేదన్నారు. రేపు సాయంత్రంలోపు అన్ని సంస్థల నుంచి పరీక్షల ఫలితాలు వచ్చే అవకాశముందన్నారు. భార లోహోలు రక్తంలో ఎలా కలిశాయనే విషయంపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఏలూరు నుంచి విజయవాడకు వస్తున్న బాధితుల్లో కొంతమందికి ఇతర ఆరోగ్య సమస్యలున్నాయని వైద్యులు చెపుతున్నారని తెలిపారు. వారి సమస్యలను గుర్తించి వెంటనే సంబంధిత వైద్య చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఏలూరులో కేసులు నమోదైన ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నామన్నామని మంత్రి వివరించారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వింతవ్యాధికి సంబంధించిన కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
ఇదీ చదవండి: ఏలూరు వింత వ్యాధి ఘటనలో మూడుకు చేరిన మృతులు