ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించే విధానానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. 1955 నాటి ఆంధ్రప్రదేశ్ సినిమాల నియంత్రణ చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయనుంది. టికెట్ల విక్రయానికి ఏపీఎఫ్‌డీసీ ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ప్రేక్షకులకు సౌకర్యంగా ఉండేలా ఆన్‌లైన్‌తోపాటు ఫోన్‌కాల్, ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే విధానం అందుబాటులోకి తెస్తామని తెలిపారు. థియేటర్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు, ప్రేక్షకులకు సమయం ఆదా చేసేందుకు, పన్నులు ఎగ్గొట్టడాన్ని నివారించేందుకు కొత్త విధానం దోహదపడుతుందని మంత్రి వెల్లడించారు.
ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డులు, పింఛను కార్డుల కోసం ఏడాది పొడవునా దరఖాస్తుల స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. ఇళ్ల పట్టాల దరఖాస్తుల్ని 90 రోజుల్లోగా, ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డులు, పింఛను కార్డుల దరఖాస్తుల్ని 21 రోజుల్లోగా పరిశీలించి అర్హులో కాదో నిర్ధారిస్తామని చెప్పారు. కొత్తగా ఎంపిక చేసినవారికి ఏటా డిసెంబరు, జూన్‌ల్లో పథకం మంజూరు చేసి, నిధులు విడుదల చేస్తామన్నారు. ఇతర సంక్షేమ పథకాలకు అర్హతలున్నా ఎంపిక కానివారు నెల రోజుల్లోగా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి కూడా పథకం అమలుకు జూన్, డిసెంబరుల్లో నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
- మేధావులు, వివిధ బీసీ సంఘాలు, సంస్థల డిమాండ్ మేరకు బీసీ కులాలవారీగా జనగణన చేపట్టాలని మంత్రివర్గం తీర్మానం. శాసనసభలోనూ తీర్మానించి, కేంద్రానికి పంపాలని నిర్ణయం.
- ప్రధాన ప్రాంతాల్లో కొత్తగా 10 పర్యాటక ప్రాజెక్టులు
- ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో 1,285 పోస్టులు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 560 గ్రేడ్-2 ఫార్మసిస్ట్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం. బోధనాసుపత్రుల్లో 2,190 మంది బోధనా సిబ్బంది, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులు కలిపి వైద్య ఆరోగ్యశాఖలో మొత్తం 4,035 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. విలేజ్ క్లినిక్‌ల్లో ఖాళీగా ఉన్న 7,390 పోస్టుల భర్తీకి ఆమోదముద్ర. మొత్తం 11,425 పోస్టులు ఈ ఏడాది నవంబరు, డిసెంబరు మాసాల్లో భర్తీ.
- రైతులకు పగటిపూట 9 గంటలపాటు విద్యుత్తు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం. యూనిట్ రూ.2.49 చొప్పున ఏడాదికి 7 వేల మెగావాట్ల విద్యుత్ పాతికేళ్లపాటు కొనుగోలు. రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) స్థానంలో ఏపీ రూరల్ అగ్రికల్చర్ సప్లై కంపెనీ ఏర్పాటుకు నిర్ణయం.
- విశాఖపట్నంలోని మధురవాడలో 200 మెగావాట్ల డేటాసెంటర్ పార్క్, బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకి అదానీ సంస్థకు 130 ఎకరాల కేటాయింపునకు ఆమోదం. అదానీ సంస్థ రూ.14,634 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని, ప్రత్యక్షంగా 24,990 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి వెల్లడి.
- విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో విశాఖ శారదా పీఠానికి సంస్కృత, వేదవిద్య పాఠశాలలు నెలకొల్పేందుకు, ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణకు 15 ఎకరాలు.. ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయింపు.
- ‘అమ్మ ఒడి’ పథకానికి అర్హత పొందాలంటే 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధన ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు. పనిదినాల్లో 75 శాతం హాజరు పరిగణనలోకి తీసుకుని 2021-22 విద్యా సంవత్సరానికి అమ్మఒడి అమలు.
- అగ్రవర్ణాల్లోని పేదల కోసం కొత్తగా ఈడబ్ల్యూఎస్ సంక్షేమశాఖ ఏర్పాటు.
- రాష్ట్రంలో ఉన్న 27వేల మంది జైనులు, 10 వేల మంది సిక్కుల సంక్షేమానికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు.
- పాల సేకరణ పరికరాలు, వస్తువుల తనిఖీ బాధ్యతలు తూనికలు, కొలతల శాఖ నుంచి పశుసంవర్థక శాఖకు బదిలీ. పశువైద్యులకు నేరుగా తనిఖీలు చేసే అధికారం.
- నవంబరు 1న వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానం.
- మావోయిస్టులు సహా నిషేధిత సంస్థలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.
- వాసవీ కన్యకాపరమేశ్వరి చౌల్టీల్రు, అన్నదాన సత్రాల నిర్వహణను తిరిగి ఆర్యవైశ్యులకే అప్పగిస్తూ నిర్ణయం.
- ఏపీ వస్తు, సేవల పన్ను చట్టసవరణ ముసాయిదాకి ఆమోదం
- శాసనమండలి, శాసనసభల్లో కొత్త విప్‌లు వెన్నపూస గోపాల్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డిలకు పేషీలు, సిబ్బంది నియామకానికి ఆమోదం.
- తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో కొత్త అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ఆమోదం. కొత్తగా 19 పోస్టులు మంజూరు.
- అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మపర్తి గ్రామంలో వేద, సంస్కృత పాఠశాలల ఏర్పాటుకు జయలక్ష్మి నరసింహశాస్త్రి, గుండ్లూరు ట్రస్ట్‌కు 17.49 ఎకరాల కేటాయింపు.
- కర్నూలు మండలం దిన్నెదేవరపాడులో క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటుకు 50 ఎకరాల ప్రభుత్వ భూమి బదలాయింపు.
- ప్రకాశం జిల్లా వాడరేవులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు.
- కడప జిల్లాలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లోని చిన్ననీటిపారుదల చెరువులకు నీరందించేందుకు రూ.227.1 కోట్లతో 5 లిఫ్ట్‌ల ఏర్పాటుకు నిర్ణయం.
- మూడు కొత్త ఆక్వాకల్చర్ ప్రాజెక్టుల కోసం 73 పోస్టులకు ఆమోదం. డిప్యుటేషన్ పద్ధతిలో 6 రెగ్యులర్ పోస్టులు, అవుట్‌సోర్సింగ్ విధానంలో 67 పోస్టులు భర్తీ.
- విజయనగరంలోని జేఎన్‌టీయూ యూనివర్సిటీకి జేఎన్‌టీయూ గురజాడ యూనివర్సిటీగా నామకరణం చేయాలని నిర్ణయం.
- నికర పన్నుపైనే వడ్డీ లెక్కింపు
జీఎస్టీ చట్టం-17లో పేర్కొన్న 15 సెక్షన్లలో సవరణలకు ఆర్డినెన్స్ రూపంలో రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా స్థూల పన్నుకి బదులు నికర పన్నుపై వడ్డీని లెక్కిస్తారు. దీనివల్ల వ్యాపారులపై ఆర్థిక భారం తగ్గుతుంది. రవాణా చేస్తున్న వాహనం, అందులోని వస్తువుల స్వాధీన, విడుదల ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీల్ చేసినప్పుడు ప్రభుత్వం విధించిన పన్నులో ప్రస్తుతం చెల్లించాల్సిన పదిశాతం డిపాజిట్‌ను 25%కి పెంచారు. పన్ను ఎగవేత, వస్తువుల రవాణాకు సంబంధించిన నేరాలను ఒకే సెక్షన్ కింద కాకుండా వేర్వేరుగా గుర్తించి జరిమానాలు విధిస్తారు. వ్యాపారులు తమ లావాదేవీలకు అనుగుణంగా జీఎస్టీ గురించి స్టేట్‌మెంట్ ద్వారా తెలియపరిచి, రిటర్నులను దాఖలు చేస్తారు. అయితే..స్టేట్‌మెంట్‌లో తెలిపిన పన్నును రిటర్నుల సమయంలో చెల్లించకుండా ఉంటే...ఇప్పటివరకు నోటీసులు జారీచేసి, అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో జాప్యం జరగకుండా ఉండేందుకు వీలుగా నోటీసు జారీచేయకుండానే చెల్లింపులను రాబడతారు. అవసరమైతే స్థిర,చరాస్తుల జప్తు వరకు అధికారులు చర్యలు తీసుకోవచ్చు.
ఇదీ చదవండి