కరోనా ప్రభావంతో చుట్టుముట్టిన ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్థిక లావాదేవీలను కొనసాగించడంతోపాటు పారిశ్రామిక ఉత్పత్తిని తిరిగి ప్రారంభించేలా అత్యవసర వస్తూత్పత్తి పరిశ్రమలు, నిరంతర ఉత్పత్తి కొనసాగించే సంస్థలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్రహోంశాఖ,రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా పరిమిత మినహాయింపులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
రైస్, దాల్ మిల్లులు, పిండిమరలు, ఆర్వో ప్లాంట్లు, ఆహార, డెయిరీ ఉత్పత్తులు,.. ఔషధాలు, సబ్బులు, మాస్కులు , బాడీ సూట్లు, కోల్డ్ స్టోరేజీలు, ఆగ్రో పరిశ్రమలు నిత్యావసర వస్తు కేటగిరీలో ఉన్నందున ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తి కొనసాగించుకోవచ్చని... ప్రభుత్వం తెలిపింది. బేకరీ, చాక్లెట్ల తయారీ కంపెనీలు, ఐస్ ప్లాంట్లు, విత్తన ప్రాసెసింగ్ కంపెనీలతోపాటు అమెజాన్, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ కంపెనీల్లో కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది.ప్రత్యేక ఆర్ధిక మండళ్లు, ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్లు విశాఖలోని మెడ్ టెక్ జోన్ తదితర పరిశ్రమలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఐటీ, హార్డ్ వేర్ సంస్థలు, బొగ్గు, చమురు, గ్యాస్ ఉత్పత్తికీ మినహాయింపు ఇచ్చారు. వైద్యులు, వైద్య సిబ్బంది నర్సులు, సైంటిస్టులు, పారామెడికల్ సిబ్బంది ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిచ్చినసర్కార్ విమాన సర్వీసులనూ వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
పరిశ్రమల్లో కార్మికులు, ఉద్యోగులకు మాస్కులు, ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలను ఇవ్వడం సహా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. కార్యకలాపాల ప్రారంభంపై ముందస్తు అనుమతి తీసుకోవాలని, ప్రతీ ఉద్యోగికి శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకుకుంటూ పరస్పర సమావేశాలు తగ్గించాలని తెలిపింది. సిబ్బందిని తరలించే వాహనాల్లో కేవలం 30 శాతం మాత్రమే తరలించాల్సిందిగా పరిశ్రమలకు సూచనలు జారీ చేసింది. లాక్ డౌన్ సమయంలో పనిచేస్తున్న వారందరికీ మెడికల్ ఇన్సూరెన్సును తప్పరిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఉత్పత్తి ప్రదేశాల్లోకి కార్మికులు, సిబ్బంది మినహా.. బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రహదారుల నిర్మాణం, జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణాలనూ కొనసాగించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐటీ సంస్థల్లో 50 శాతం మంది ఉద్యోగులతో పనిచేసేందుకు అనుమతి ఇవ్వగా డాటా , కాల్ సెంటర్లలో ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేసింది. అన్ని సరకు రవాణా వాహనాలకూ అనుమతిచ్చింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన సీఎస్ నీలం సాహ్ని గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్ జోన్ మండలాల్లో పరిశ్రమలను తెరిచి కార్యకలాపాలను అనుమతించే విషయమై కార్యాచరణ రూపొందించాల్సిందిగా ఆదేశించారు. ఏ పరిశ్రమలను కార్యకలాపాలకు ఆనుమతించవచ్చో జిల్లా స్థాయి కమిటీ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు పనికల్పించే అంశంపైనా దృష్టిసారించాలన్నారు.
ఇవీ చదవండి