రాష్ట్రవ్యాప్తంగా ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో జారీచేసిన ఆదేశాల ప్రకారం ప్రతి ఉన్నతాధికారి క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు, వాటి తీరుతెన్నులు లబ్ధిదారుల నుంచే సేకరించాలని అన్నిశాఖల కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు నెలలో మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే పర్యటించాల్సిందిగా సూచనలు ఇచ్చింది.
ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో.. నిర్వహించే వీడియో కాన్ఫరెన్సుల పైనా మార్గదర్శకాలను జారీ చేశారు. ఇక నుంచి వారంలో ఒక్క రోజు మాత్రమే వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎప్పుడంటే అప్పుడు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించేందుకు వీల్లేదని సీఎస్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులందరికీ మార్గదర్శకాలు ఇచ్చారు. ఇష్టారీతిన వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తే.. అప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, జేసీలు, ఇతర ఉన్నతాధికారులు సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ గురువారం వీడియో కాన్ఫరెన్సులను నిర్వహించుకోవాలని దానికి అజెండా ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించారు. గురువారం రోజు కాకుండా ఇతర సమయాల్లో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించేందుకు సీఎస్ అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి
AP High Court: హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం