ప్రజారోగ్య చట్టం-1939 ప్రకారం.. క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు నోటిఫికేషన్ ఇచ్చారు. వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన, పరిశోధన, నియంత్రణ, చికిత్స తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించేలా కార్యాచరణ చేపట్టనున్నట్టు నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. వ్యాధి గురించి అవగాహన లేకపోవటంతో వెల్లడికాని కేసుల సంఖ్య పెద్దఎత్తున ఉన్నట్టు గుర్తించినట్లు చెప్పింది. క్యాన్సర్ గుర్తింపు, సరైన సమయానికి ఆస్పత్రుల్లో చికిత్స, వ్యాధి నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక విధానం రూపొందించాల్సి ఉందని తెలిపింది.
ఇక నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, పాథోలాజికల్ ల్యాబ్‌లు, రేడియాలజీ ల్యాబ్‌లు. క్యాన్సర్ వ్యాధిని రిపోర్టు చేయాల్సిందింగా సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. క్యాన్సర్ రోగికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి పంపిచాలని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన క్యాన్సర్ కేసుల వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో పంపాలని వైద్యారోగ్యశాఖ పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బోధనాసుపత్రులు, రాష్ట్ర, కేంద్రప్రభుత్వ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, వైద్య సంస్థలు, ఈఎస్ఐ, పరిశ్రమలు, రైల్వే, సివిల్ ఆర్మీ ఆస్పత్రులు, ఆయుర్వేద, యూనానీ వైద్య సంస్థల నుంచి ఈ సమాచారం ఇవ్వాలని సూచిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. వ్యాధి గుర్తించిన వారంలోగా రోగి వివరాలు పంపాల్సిందిగా సూచించిన వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: ఏపీపీఎస్సీని చుట్టుముట్టిన రాష్ట్ర ఆర్థిక సంక్షోభం !