కృష్ణ జలాలపై తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రైతులు తెలంగాణ హైకోర్ట్‌లో ఆదివారం హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ సాంకేతిక కారణాల వల్ల వీలుపడలేదు. వంద శాతం విద్యుదుత్పత్తి చేయాలన్న జీవో 34.. పునర్విభన చట్టానికి విరుద్ధంగా ఉందని పిటిషనర్లు తెలిపారు. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్, తెలంగాణ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, జెన్‌కో ఛైర్మన్, ఎండీ, తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శులను, వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. విద్యుత్, సాగు అవసరాల కోసం నీటి వినియోగ విషయంలో కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్-1 జారీచేసిన అవార్డు, 2015 జూన్ 18,19 తేదీల్లో చేసుకున్న పరస్పర ఒప్పందానికి కట్టుబడి ఉండేలా తెలంగాణ ఇంధన శాఖ, జెన్‌కోను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఏపీ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర జల శక్తి కార్యదర్శిని ఆదేశించాలని అభ్యర్థించారు.
తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఏకపక్షంగా జీవో 34 ను జారీచేశారంటూ.. పిటిషనర్లు వ్యాజ్యంలో ప్రస్తావించారు. ఇది విద్యుత్ చట్టం-2003 కి విరుద్ధంగా ఉందంటూ పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఇంధన శాఖ, జెన్‌కోకు సలహాలు మాత్రమే ఇవ్వగలదుకాని.. తప్పని సరి ఆదేశాలు జారీ చేసే హక్కు లేదన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు ఉమ్మడి రాష్ట్రాలకు చెందినవని..నీటి వినియోగ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శికి మాత్రమే అధికారం ఉండదని ప్రస్తావించారు. పులిచింతల జలాశయం కృష్ణా డెల్టా నీటి అవసరాల్ని తీరుస్తుందని.. తెలంగాణ రాష్ట్రానికి ఈ జలాశయంలో నీటిని నిల్వ చేసుకునే హక్కులేదన్నారు. పులిచింతల పవర్ హౌజ్ నుంచి తెలంగాణ ఇంధన శాఖ నీటిని విడుదల చేస్తోందని.. ప్రస్తుతం సాగుకు నీరు అవసరం లేని కారణంగా జలాశయాల నుంచి విడుదల చేసిన నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 10, 23, 29వ తేదీల్లో ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి .. కృష్ణా నది మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖరాస్తూ.. తెలంగాణ ఇంధన శాఖ విచక్షణారహిత విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయాలని కోరారని ప్రస్తావించారు. కృష్ణా నది మేనేజ్ మెంట్ బోర్డు(KRMB) జూన్ 17 న ఉత్తర్వులు జారీచేస్తూ.. శ్రీశైలం ఎడమ విద్యుత్ హౌజ్ నుంచి నీటి విడుదలను తక్షణం నిలిపేయాలని కృష్ణా నది మేనేజ్ మెంట్ బోర్డు(KRMB) ఆదేశించినప్పటికీ.. ఆ ఉత్తర్వులను తెలంగాణ ఇంధన శాఖ పెడచెవిన పెట్టిందన్నారు.
ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి జారీచేసిన జీవోను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. నీటి వినియోగ విషయంలో కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్ -1 జారీచేసిన ఆదేశాలకు కట్టుబడి ఉండేలా తెలంగాణ ఇంధన శాఖ, తెలంగాణ జెన్‌కోను ఆదేశించాని పిటిషన్‌లో కోరారు.
ఇదీ చదవండి: