పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చలు విషయంపై ఆలోచిస్తామని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ తేల్చిచెప్పింది. ప్రభుత్వం చర్చలకు రావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్సి రెండు సార్లు చేసిన శశిభూషణ్ చేసిన ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యమాన్ని విజయవంతం చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పీఆర్సీ సాధన సమితి ఆదివారం సమావేశమై చర్చించింది. విజయవాడలోని రెవెన్యూ అసోషియేషన్ భవనంలో జరిగిన ఈ సమావేశానికి 4 ప్రధాన ఐకాస నేతలు హాజరై.. కీలక అంశాలపై 5 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. చర్చలకు రావాలని ఓ సారి మంత్రులు బొత్స , పేర్ని నాని ఫోన్లు చేయగా... మరోసారి జీఎడీ కార్యదర్శి ఫోన్ చేయడంతో చర్చలకు వెళ్లాలా వద్దా అనే అంశంపై స్టీరింగ్ కమిటీలో చర్చించారు. మంత్రుల కమిటీ పరిధి ఏంటో ప్రభుత్వం తెలియజేయని కారణంగా చర్చలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.
రోజువారీ ఆందోళనలను విజయవంతం చేసేందుకు పీఆర్సీ సాధన సమితి ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతి జిల్లాకు ప్రతి జేఏసీ తరపున ఒక్కో రాష్ట్రస్థాయి నాయకుడిని పంపాలని... నలుగురు నేతలను పర్యవేక్షణ కోసం కేటాయించాలని తీర్మానించారు. స్టీరింగ్ కమిటీ లో ప్రస్తుతం ఉన్న 12 మందికి అదనంగా మరో 8మంది సభ్యులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోందన్న సమితి నేతలు సమర్ధంగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఉద్యోగులు మృదు స్వభావంతో విమర్శలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పీఆర్సీసాధన సమితి నేతలు పిలుపునిచ్చారు.
"ఇవాళ మధ్యాహ్నం 3 గం.కు సమ్మె నోటీసు ఇస్తాం. స్టీరింగ్ కమిటీ సభ్యులను 12 నుంచి 20 మందికి పెంచాం. మావి గొంతెమ్మ కోరికలు కాదు.. న్యాయమైన డిమాండ్లు. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందికి లబ్ధి జరిగే వరకు పోరాడతాం. మాతో చర్చలకు కమిటీ వేసినట్లు అధికారిక సమాచారం లేదు. కమిటీ పరిధి, నిర్ణయాధికారంపై మాకు స్పష్టత లేదు. రేపు మధ్యాహ్నం 12 గం.కు చర్చలకు పిలిచారు. జీవోల అమలు నిలిపివేస్తూ ఉత్తర్వు ఇచ్చేవరకు చర్చలకు వెళ్లం. జనవరికి డిసెంబరు జీతాన్నే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఇవ్వాలని డిమాండ్ ఇవ్వాలి" - పీఆర్సీ సాధన సమితి
పీఆర్సీ సాధనే ధ్వేయంగా ముందుకు వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. సీఎస్ కు ఇచ్చే సమ్మె నోటీసులోనూ పీఆర్సీ సహా సంబంధిత అంశాలనే ఉంచాలని నిర్ణయించారు. పీఆర్సీతో ఉద్యోగుల వేతనాలు తగ్గడం వల్లనష్టం జరుగుతోందని, హెచ్ ఆర్ ఎ తగ్గించడం వల్ల తన జీతం కూడా తగ్గుతోందని సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు.
పీఆర్సీ పై ఇచ్చిన జీవోలను అమలు చేసే విషయమై ఆర్థిక శాఖలో ఉన్నతాధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని పీఆర్సీ సాధన సమితి ఆరోపించింది. పీఆర్సీ ఉత్తర్వులు అమలు చేయాలని కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని నేతలన్నారు. పాత జీతాలు ఇచ్చేలా సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని సమితి సూచించింది.
ఇదీ చదవండి: ap employees steering committee: రేపు మధ్యాహ్నం 3 గం.కు సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానం