రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. అందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్‌చాందీ, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు ఎం.ఎం.పళ్లంరాజు, జె.డి.శీలం, చింతా మోహన్, పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావులను బుధవారం తన నివాసానికి ఆహ్వానించారు. ఒక్కో నేతతో సుమారు పదిహేను నిమిషాలకు పైగా వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, పార్టీ పునర్‌వైభవానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై నేతలను రాహుల్ ప్రశ్నించారు. వారు రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులను వివరించారు. సమావేశం అనంతరం నేతలు విలేకర్లతో మాట్లాడారు.
* పార్టీ బలోపేతానికి రాహుల్ సలహాలు అడిగారని కేంద్ర మాజీమంత్రి పళ్లంరాజు తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడితే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా ఎక్కువగా ఉంటుందని వివరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పాలన సక్రమంగా లేదని, అప్పుల్లో కూరుకుపోయిన విషయాన్ని తెలియజేసినట్లు ఆయన వివరించారు.
* రాష్ట్రంలో పాలనే లేదని రాహుల్‌కు తెలిపామని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ చెప్పారు. త్వరలో రాజకీయ మార్పులు వస్తాయన్నారు. 2024 కేంద్రంలో, ఏపీలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
* రాహుల్‌గాంధీతో సమావేశం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేస్తామన్నారు. భావోద్వేగంతో తమ పార్టీ ఓటుబ్యాంకును జగన్ తీసుకెళ్లారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి పన్నుల రూపంలో వసూలు చేస్తోంది ఎక్కువ, ప్రజలకు ఇచ్చేది తక్కువన్నారు.
* రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకు నాయకులను రాహుల్‌గాంధీ పిలిచారని రాజ్యసభ మాజీ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి అవసరమైన చర్యలు ఆయన తీసుకుంటారని నమ్మకంతో తానున్నానని చెప్పారు.
ఇదీ చదవండి: