రాష్ట్రానికి ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలు వస్తాయని ప్రత్యేక హోదా పోరాట పరిషత్ అధ్యక్షులు రాజశేఖరరావు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన భాజపా.. దాన్ని నిరూపించుకోవాలని అన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని రాజశేఖరరావు అన్నారు.
అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ఇవ్వడానికి కొన్ని షరతులు ఉంటాయని భాజపా చెబుతోందని అన్నారు. షరతులకు తగ్గ పరిస్థితులు రాష్ట్రానికి లేనందున హోదా ఇవ్వడం కుదరని చెబుతున్నారని తెలిపారు. మరి ముందుగా ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామని హామీ ఇచ్చారని ఎదురుదాడి చేశారు.
ఏ రాష్ట్రాన్నైతే బలవంతంగా విభజించారో.. రాష్ట్రంలో లోటు బడ్జెట్‌కు కారణమయ్యారో.. ఆ రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్) కోసం రాష్ట్ర విభజన పరిహార చట్టం తీసుకొచ్చి న్యాయం చేయొచ్చని సూచించారు.
ఇప్పటికైనా భాజపాకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి రావాల్సిన అంశాలను అమలు చేయాలన్నారు. హోదా, విభజన హామీల సాధనకై పోరాట పరిషత్ ఆవిర్భవించిందని, అన్ని రాజకీయ పార్టీలతో మలి దశ ఉద్యమం చేపడతామన్నారు.
ఇదీ చదవండి: VIJAYA SAI REDDY: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి.. అలాగే ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లకు కూడా..!