రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ - అమూల్ ప్రాజెక్టుకు ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. జిల్లాల్లో పాలసేకరణ అంతంతమాత్రంగా ఉండటం, ఇక్కడ కొనుగోలు చేసిన పాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి శుద్ధి చేయించాల్సి ఉండటంతో ప్రాజెక్టు నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ సేకరిస్తున్న పాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేయాల్సి వస్తుంది. విశాఖలో ఉన్న ఏపీ డెయిరీ ప్లాంటు మినహా ఇతర ప్లాంట్లను వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నా.. నిర్వహణ వ్యయం చేయలేక ప్రభుత్వం వీటిని మూసివేసింది. ఫలితంగా.. రాష్ట్రంలోని వేర్వేరు అవసరాలకు పొరుగు రాష్ట్రాల నుంచే పాలను తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యమంత్రి చెప్పినా...?
రాష్ట్రంలోని అంగన్వాడీలకు నెలకు 1.1 కోట్ల లీటర్ల పాలను కర్ణాటక నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీని కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోని పాల ఫ్యాక్టరీలను అమూల్‌కు లీజుకిస్తే.. రవాణా ఖర్చు రూపంలోనే దాదాపు రూ. 10 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 8 జిల్లాల్లో ఏపీ డెయిరీకి చెందిన పాల ఫ్యాక్టరీలు ఖాళీగా ఉన్నాయి. విద్యుత్, నీరు, ఇతర అవసరాల రీత్యా ఇవేవీ పనిచేయకపోయినా.. నెలకు రెండు కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవి లీజుకు తీసుకుని రూ. 4 నుంచి 5 కోట్లు చెల్లించేందుకు అమూల్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పినా... ఆర్థికశాఖ అధికారులు ఈ దస్త్రాన్ని క్లియర్ చేయకుండా పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం.
రోజుకు రూ. 40 లక్షలు నష్టం??
ప్రస్తుతం ప్రకాశం, చిత్తూరు, కడపలలో పెద్ద మొత్తంలోనూ.. ఇతర ప్రాంతాల్లోనూ ఏపీ - అమూల్ ప్రాజెక్టు పాలను సేకరిస్తోంది. అయితే సేకరించిన పాలను ఇతర రాష్ట్రాలకు తరలించి అక్కడ శుద్ధి చేసి ప్యాకింగ్ అనంతరం విక్రయించాల్సి వస్తోంది. దీంతో రోజుకు రూ. 40 లక్షల మొత్తాన్ని... ఏపీ-అమూల్ ప్రాజెక్టు నష్ట పోవాల్సి వస్తున్నట్లు సమాచారం. అమూల్ ప్రాజెక్టు కోసం బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏపీ డెయిరీ 1,300 కోట్ల రుణాన్ని ఎన్సీడీసీ నుంచి పొందింది. ఈ నిధుల నుంచి కొంత మేర ఖర్చు చేసి ఏపీ డెయిరీ ప్లాంట్లను సిద్ధం చేసి లీజు ప్రాతిపదికన అమూల్‌కు అప్పగిస్తే కొంతమేర ఆదాయం వచ్చే అవకాశముంది. దీంతో పాటు కర్ణాటక నుంచి కొనుగోలు చేస్తున్న పాల వ్యయాన్ని తగ్గించుకునే వీలుంది.
ఇదీ చదవండి: