గ్రామ వాలంటీర్ల పోస్టులకు ఈనెల 11 నుంచి నిర్వహించిన ఇంటర్వ్యూలు గురువారంతో ముగిశాయి. వీటిలో పట్టణ వాలంటీర్ల పోస్టులకు అనూహ్య స్పందన లభించింది. కేవలం నలుగురు మినహా మొత్తం అభ్యర్థులంతా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 110 పట్టణాల్లో 1,58, 474 మందికి సమాచారాన్ని పంపితే నలుగురు తప్ప మిగిలిన అభ్యర్థులంతా హాజరయ్యారు. పోటీ పరీక్షలకు 70 నుంచి 80 శాతం మాత్రమే హాజరు శాతం ఉంటుండగా... వాలంటీర్ల ఇంటర్వ్యూలకు భారీ స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వాలంటీర్ల నియామకం కోసం చివరి రోజు గురువారం వరకు 9,26,210 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రిజర్వేషన్లు, ఇంటర్వ్యూలో అభ్యర్థుల ప్రతిభ, విద్యార్హతల ఆధారంగా 3 రోజుల్లో వాలంటీర్లను అధికారులు ఎంపిక చేయనున్నారు. 2,30,160 పట్టణ, గ్రామ వాలంటీర్లకు రాష్ట్రవ్యాప్తంగా 9,62,707 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 9,26,227 మందిని ఈనెల 11 నుంచి జరిగే ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. గ్రామాల్లో 7,67,753 మందిని పిలవగా 7,67,740 మంది వచ్చారు. గిరిజన ప్రాంతాల్లో 39,357 మందిని ఆహ్వానించగా 37,865 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు.
రెండు వారాలుగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు మూడు విభాగాల్లో కలిపి జిల్లాల వారీగా హాజరైన వాలంటీర్ అభ్యర్థులను పరిశీలిస్తే...
జిల్లా | ఇంటర్వూలకు హాజరైన అభ్యర్థులు |
అనంతపురం | 71,818 |
చిత్తూరు | 64,002 |
తూర్పుగోదావరి | 94,207 |
గుంటూరు | 72,240 |
కృష్ణా | 60,071 |
కర్నూలు | 1,02,441 |
ప్రకాశం | 63,209 |
నెల్లూరు | 45,114 |
శ్రీకాకుళం | 77,378 |
విశాఖపట్నం | 95,455 |
విజయనగరం | 66,848 |
పశ్చిమ గోదావరి | 61,262 |
కడప | 52,165 |
మొత్తం | 9,26,210 |