విజయవాడ నగరంలోని విద్యాధరపురం ప్రాంతానికి చెందిన ఓ బాలుడి తల్లి పువ్వులు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. బాలుడి వయసు 11 నెలలప్పుడు తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తల్లే పెంచుతోంది. సంపాదించిన డబ్బులతో కుమారుడిని చదివిస్తోంది. ప్రస్తుతం బాలుడు తొమ్మిదో తరగతిలోకి వచ్చాడు. కరోనా లాక్ డౌన్ వల్ల పాఠశాలలు మూసే ఉన్నాయి. సప్తగిరి ఛానల్ లో వస్తున్న ఆన్లైన్ పాఠాలు వింటున్నాడు. స్మార్ట్ ఫోన్ ఉంటే.. యూట్యూబ్ లో తరగతులు వినేవాడినంటూ తల్లితో చెబుతూ బాధపడుతూ ఉండే వాడు. దీంతో తల్లి.. తమ వద్ద డబ్బులు లేవని, పాఠశాలలు తెరిస్తే పాఠాలు చెబుతారని, ఫోన్ అవసరం ఉండదంటూ నచ్చజెబుతూ వస్తోంది.
బుధవారం మధ్యాహ్నం కుమారుడు స్నానం చేసి రమ్మని చెప్పింది. స్నానానికి వెళ్లిన బాలుడు. ఎంత సేపటికి బయటకు రాకపోవటంతో వెళ్లి చూసింది. ఉరి వేసుకుని కనిపించాడు కుమారుడు. నిర్ఘాంతపోయిన తల్లి.. ఆటోలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వారు చేర్చుకోకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా.. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఆసుపత్రి నుంచి భవానీపురం పోలీసులకు వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.