తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో అధికార వైకాపా విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి.. 2 లక్షల 71వేల 592 ఓట్ల ఆధిక్యంతో.. తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మీపై గెలుపొందారు. గత ఎన్నికల్లో కన్నా ఎక్కువ ఆధిక్యతను వైకాపా సాధించినప్పటికీ.. ఆ పార్టీ నైతికంగా ఓడిపోయిందని తెలుగుదేశం విమర్శించింది.
తిరుపతి లోక్‌సభ స్థానాన్ని అధికార వైకాపా నిలబెట్టుకుంది. ప్రధాన పార్టీల వాడీవేడి ప్రచారాలతో హోరెత్తిన లోక్‌సభ ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి.. ప్రత్యర్థులకు అందనంత ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంతో దూసుకెళ్లిన ఆయన.. 2 లక్షల 71 వేల 592 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించిన గురుమూర్తికి..రిటర్నింగ్ అధికారి నెల్లూరులో డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు.
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ.. వైకాపా సంపూర్ణ ఆధిక్యం చాటుకుంది. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 34 వేల 692 ఓట్లు, సత్యవేడులో 38 వేల 144, శ్రీకాళహస్తిలో 39వేల 304 ఓట్ల ఆధిక్యం వైకాపా అభ్యర్థికి దక్కింది. అలాగే నెల్లూరు జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లు అయిన.. సర్వేపల్లిలో 40వేల 895, సూళ్లూరుపేటలో 39 వేల 885, గూడూరులో 36 వేల 492, వెంకటగిరిలో 42 వేల 224 ఓట్ల మెజార్టీని సాధించింది. మొత్తమ్మీద.. వైకాపాకు 6 లక్షల 26 వేల 108 ఓట్లు రాగా.. తెలుగుదేశం పార్టీకి 3 లక్షల 54 వేల 516 ఓట్లు పోలయ్యాయి. ఇతర పార్టీలు నామమాత్రంగానే ఓట్లు దక్కించుకున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి చేసిన మంచిపనులే వైకాపాను గెలిపించాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి సంతోషం వ్యక్తం చేశారు. ఉపఎన్నికలో వైకాపా గెలుపొందినా.. నైతిక విజయం తెలుగుదేశానిదేనని.. పనబాక లక్ష్మి అన్నారు. 5 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుస్తామని చెప్పి, సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: జగన్ పాలన మెచ్చి..ప్రజలు నా వైపు నిలిచారు: గురుమూర్తి