కాన్పు కోసం వస్తే గర్భం రాలేదని ఆస్పత్రి నిర్వాహకులు చెబుతున్నారంటూ మహిళ వాగ్వాదానికి దిగిన ఘటన తిరుపతిలో జరిగింది. తన గర్భంలోని శిశువును మాయం చేశారని ఆమె ఆరోపించారు. బాధితురాలి కథనం ప్రకారం... నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఓ మహిళ కాన్పు కోసం తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 16న చేరారు. అన్ని పరీక్షలు జరిపిన తర్వాత గర్భం ఉందని చెప్పిన వైద్యులు... ఆ తరువాత మాట మార్చారు. ఆసుపత్రిలో ఎప్పుడు చేరావంటూ తనను ప్రశ్నిస్తున్నారని ఆమె చెప్పారు. తనకు మత్తు మందు ఇచ్చి గర్భంలోని శిశువును తీసి మాయం చేశారని ఆరోపిస్తున్నారు. వైద్యులు అబద్ధమాడుతున్నారని ఆమె బంధువులు అన్నారు. న్యాయం చేయాలంటూ ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
గర్భం కాదు... గాలి బుడగలు
ఘటనపై ఆసుపత్రి వైద్యులు స్పందించారు. ఆమె ఆసుపత్రికి వచ్చిన మాట వాస్తమేనని... కానీ కాసేపటికే తిరిగి వెళ్లిపోయిందని తెలిపారు. మళ్లీ ఇవాళ ఉదయం వచ్చి తమ బిడ్డను ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారని చెప్పారు. ఆమె వద్ద ఉన్న రిపోర్టులను పరిశీలించగా కడుపులో గాలి బుడగలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటినే గర్భంగా భావించి ఉంటుందని పోలీసులకు వైద్యులు ఫిర్యాదు చేశారు. ఆమెకు నమ్మకం లేకపోతే ఏ ఆస్పత్రిలోనైనా పరీక్షలు చేయించుకోవచ్చునని తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... మహిళకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. ఆమె గర్భవతి కాదని అక్కడి వైద్యులు తేల్చారు.
గర్భం కాదని ముందే చెప్పా
ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టిన మహిళకు గర్భం లేదని ముందే చెప్పానని నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన వైద్యురాలు మైథిలి వెల్లడించారు. ఆమె గర్భంలో బుడగలు/ థైరాయిడ్ వచ్చిందనే అనుమానంతోనే చికిత్స అందించానని తెలిపారు. తన వద్ద గర్భానికి వైద్యం తీసుకున్నానని పోలీసులకు బాధిత మహిళ వివరించిన నేపథ్యంలో వైద్యురాలు స్పందించారు. గర్భం దాల్చిందని తాను ధ్రువీకరించానంటూ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు.
ఇదీ చదవండి
కేంద్రానికి భాజపా నేతలు ఫిర్యాదు చేసుకోవచ్చు: మంత్రి వెల్లంపల్లి