శ్రీవాణి ట్రస్టుతోపాటు దేవాదాయ శాఖ నిధులతో చేపట్టిన ఆలయాల నిర్మాణాలకు సంబంధించి మాస్టర్ డేటాబేసిడ్ సిస్టం తయారు చేయాలని తితిదే ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. వెనుకబడిన ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మాన్ని మరింత వ్యాప్తి చేయడానికి పలు ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాన్ని తితిదే చేపట్టింది. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కాలనీల్లో ఆలయాల నిర్మాణం కోసం అందిన 1100 దరఖాస్తులను దేవాదాయ శాఖ పరిశీలనకు పంపామన్నారు. వాటి పరిశీలన పూర్తైన వెంటనే ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు. తితిదే పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో శ్రీవాణి ట్రస్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. వెనుకబడిన ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మాన్ని మరింత వ్యాప్తి చేయడంలో భాగంగా పురాతన ఆలయాల పునర్నిర్మాణం, ఆలయాలు లేనిచోట ఆలయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 11 ఆలయాల నిర్మాణానికి రూ. 8.48 కోట్ల మంజూరుకు ఈవో ఆమోదం తెలిపారు. ఈ నిధులతో చేపట్టిన 50 ఆలయాలు, 84 ఆలయాల జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణం, 42 భజన మందిరాల పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని తితిదే అధికారులను ఆదేశించారు. ఆలయాల నిర్మాణం, పునర్నిర్మాణం, జీర్ణోద్ధరణ పనులు సకాలంలో పూర్తి చేసేందుకు దేవాదాయ శాఖ కమిషనర్‌తో సమన్వయం చేసుకోవాలని తితిదే ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి
కొత్త పే స్కేళ్ల ప్రకారం జీతాల ప్రాసెస్‌కు ఆదేశాలు.. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ