తమిళనాడులో పట్టుబడిన తితిదే బంగారంపై.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో.. బంగారం తరలింపు పూర్తి బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదే అని తేల్చి చెప్పారు. బ్యాంకు వచ్చి ట్రెజరీలో ఇస్తేనే అది తితిదే బంగారమవుతుందని తెలిపారు. బంగారం తరలింపు వివాదంపై సింఘాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తితిదేకు రావాల్సిన బంగారం వచ్చినందున స్పష్టత ఇస్తున్నామని ఈవో అన్నారు.
గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు బాగా వస్తాయా లేదా అనేది మాత్రమే బోర్డు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కేజీ బంగారం డిపాజిట్ చేయాలన్నా బోర్డు నిర్ణయమే అంతిమమని చెప్పారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బంగారం.. తిరిగి తితిదేకు అందించే వరకూ సదరు డిపాజిట్ తీసుకున్న సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని వివరించారు.
ఎన్నికల సంఘం సీజ్ చేసే సమయంలో.. బంగారానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయని పీఎన్బీ తితిదేకు చెప్పిందని సింఘాల్ గుర్తు చేశారు. తితిదేకు సంబంధించిన బంగారం మరునాడు తీసుకొస్తామంటూ పీఎన్బీ అధికారులు ఫొన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘానికి డాక్యుమెంట్లు చూపామని బ్యాంక్ అధికారులు తెలిపినట్లు సింఘాల్ స్పష్టం చేశారు. వాళ్లు ఈసీకి ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో తితిదేకు తెలియదన్నారు.
"మార్చి 27న పీఎన్బీకి లేఖ రాసి ఏప్రిల్ 18 న బంగారం అందజేయమని అడిగాం, వారు ఏప్రిల్ 18కి బదులుగా ఏప్రిల్ 20 బంగారం అందజేశారు"- సింఘాల్
గోల్డ్ డిపాజిట్ స్కీమ్ 2000 ఏప్రిల్ 1 న ప్రారంభమైందని... ఎస్బీఐలో 5,387 కిలోలు, పీఎన్‌బీలో 1381 కిలోల బంగారం ఉందని ఈవో తెలిపారు. తితిదే కు సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉందన్నారు. బ్యాంకర్లకు 1.5 శాతం హ్యాండ్లింగ్ ఛార్జీలు, 1 శాతం కమిషన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 18, 2016లో పీఎన్‌బీలో 1381 కిలోల బంగారం వేశామని, ఏప్రిల్ 18, 2019కి మెచ్యూరిటీ అవుతుందని తెలిపారు.
ఇదీ చదవండి