తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం(TTD NEW BOARD MEETING HELD AT ANNAMAYYA BHAVAN) అన్నమయ్య భవన్‌లో నిర్వహించారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి 18 మంది సభ్యులు నేరుగా హాజరుకాగా మిగిలినవారు వర్చువల్‌గా పాల్లొన్నారు. బోర్డు సమావేశంలో ప్రధానంగా జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ. 17.40 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపారు. చెన్నై, బెంగళూరు, ముంబైలో తితిదే సమాచార కేంద్రాలు మరియు శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. అలిపిరి నడకమార్గం సుందరీకరణ పనుల కోసం రూ. 7.50 కోట్లతో టెండర్లను ఆమోదించారు.
కడప జిల్లా రాయచోటిలో తితిదే కల్యాణమండపం నిర్మాణానికి రూ. 2.21 కోట్లను కేటాయించారు. తితిదే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఆప్‌కాస్ తరహాలో తితిదే కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల హెల్త్ ఫండ్‌కు ఆమోదం బోర్డు తెలిపింది. తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనంలో అభివృద్ధి పనులు మరియు మరమ్మతులు చేపట్టేందుకు రూ. 2.61 కోట్ల నిధులను కేటాయించారు. స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్ రీసెర్చి భవనంలో అదనంగా 4, 5 అంతస్తుల నిర్మాణ పనులకు రూ. 4.46 కోట్లను మంజూరు చేశారు.