సమాజాన్ని చైతన్యపరిచి...వ్యక్తులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే శక్తి విద్యారంగానికి ఉంది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యావ్యవస్థను......అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లటమే దేశపురోభివృద్ధికి కీలకం. ప్రపంచంలోని చాలా దేశాల్లో అవలంబిస్తున్న విద్యాప్రమాణాల స్థాయితో పోల్చి చూస్తే మన దేశం వెనుకంజలో ఉందనుకోవటానికి కారణలెన్నో. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దాని ప్రభావం అన్ని రంగాల పైనా ఫలితాన్ని చూపిస్తోంది. ఎన్నో కీలక సంస్కరణలు మార్పులు చేర్పులకు చాలా రంగాలు ఆహ్వానం పలకాల్సిన పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డాయి. ఇలాంటి సందర్భాన్నే అవకాశంగా మలుచుకుని జాతీయ విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలనే ఆలోచనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలమునకలై ఉన్నాయి.
మన దేశీయ విద్యావ్యవస్థలో కరోనా ప్రభావంతో చోటు చేసుకోనున్న మార్పులేంటి....వ్యవస్థలో కనిపిస్తున్న లోపాల్ని అధిగమించేలా దేశంలోనే అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీలు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నాయనే అంశంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ తరుణంలో అందుబాటులోకి వస్తున్న అత్యున్నత సాంకేతికతను అందిపుచ్చుకోవటంతో పాటు....మనదైన సంస్కృతిని ప్రతిబింబించే సనాతన విద్యావ్యవస్థను మిళితం చేసి ప్రయోగాలు సాగించాల్సిన అవసరం ఉందంటున్న తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎస్ సత్యనారాయణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ప్రశ్న:
కరోనా మహమ్మారి అనేక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ప్రత్యేకించి విద్యారంగంలో కరోనా వైరస్ తీసుకొచ్చిన మార్పులు ఎలాంటి ప్రభావాన్ని చూపించనున్నాయి?
జవాబు:
విద్యను ఓ నిత్యావసరంగా పరిగణించాల్సిన ఆవశ్యకత ఉంది. విద్యారంగంలో చాలా మార్పులు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పాఠాలు చెప్పే విధానం దగ్గర నుంచి ప్రతి దశలోనూ ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే...ఈ స్థాయిలో మార్పులు జరగాలంటే ఐదారు సంవత్సరాలు పట్టేది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో అదంతా మూణ్నాలుగు నెలల్లోనే సాధ్యమైంది. ఉదాహరణకు ఆన్ లైన్ విద్యావిధానం అందరికీ అందుబాటులోకి వస్తోంది. దీనివల్ల విద్యారంగంలో ప్రజాస్వామ్యం అనే మాట వినిపిస్తోంది. సాధారణంగా ఐఐటీల్లో మెరుగైన, తెలివైన విద్యార్థులు వచ్చి చేరుతుంటారు. ఇక్కడ ఉండే అధ్యాపక బృందాలు సైతం అంతేస్థాయి ప్రతిభాపాటవాలను కలిగి ఉంటారు. ఇప్పుడు ఆన్ లైన్ విద్యావిధానం ద్వారా ప్రపంచంలో ఉన్న ఉత్తమ అధ్యాపకులు అందరూ...విద్యార్థులందరికీ అందుబాటులోకి వెళ్తున్నారు. తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గొర్తి లాంటి వాళ్ల ఆన్ లైన్ తరగతులకు సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం నేషనల్ డిజిటల్ లైబర్రీలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆ క్లాసులను దేశంలోని విద్యార్థులందరూ వీక్షించే అవకాశం ఏర్పడుతోంది. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితులుండేవి కావు.
ప్రశ్న:
క్లాస్ రూం టీచింగ్ కి సంబంధించి ఇప్పటి వరకూ ఓ నిర్దుష్టమైన ప్రోగ్రామింగ్ ఉంది. ఇదంతా గురుకులాల కాలం నుంచి ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చింది. ఈ ఆన్ లైన్ క్లాసుల మార్పు అనేది వాటిని సమూలంగా మార్చివేస్తుందంటారా?
జవాబు:
పూర్తిగా పాత విధానాన్ని మార్చేయకూడదు. రెండింటినీ సమతూకంతో చూడాల్సిన అవసరం ఉంది. అత్యాధునిక సాంకేతికతను అవసరమైప్పుడే వినియోగించాలి. ఇప్పుడిప్పుడే అధ్యాపకులు సైతం సాంకేతికత వినియోగంపై దృష్టి సారిస్తున్నారు. నేటితరంతో సరిసమానంగా ఉండగలిగేలా కృషి చేస్తున్నారు. ఐతే ఇదంతా ఓ సమవిధానంలో సాగాల్సిన అవసరం ఉంది. పూర్తిగా పాత విద్యావిధానాన్ని మార్చేసి ఆన్ లైన్ క్లాసుల సిస్టం ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలు అంత మంచిది కాదు.
ప్రశ్న:
తరగతి గదుల్లో పాఠాలు బోధించేటప్పుడు...ఉపాధ్యాయుడికి...విద్యార్థులకు మధ్య ఓ అవగాహన ఏర్పడటానికి గతంలో ఆస్కారం ఉండేది. విద్యార్థుల ప్రతిభాపాటవాలను నేరుగా గమనించే వీలుండేది...ఈ ఆన్ లైన్ క్లాసుల్లో ఆ స్థాయిలో విద్యార్థులపై ఉపాధ్యాయులకు అవగాహన ఏర్పడుతుందంటారా?
జవాబు:
కచ్చితంగా అది సాధ్యం కాదు. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎవరు చెప్పేదాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది పోల్చుకోవటం కష్టం. ఎక్కువ మంది విద్యార్థులకు ఒకే సారి చెప్పాలన్నా కష్టంగా ఉంటుంది. సంస్థాగతంగా చాలా లోపాలున్నాయి ఐతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్ లైన్ విద్యావిధానం తప్ప మరో ఆస్కారం కనిపించని పరిస్థితులున్నాయి.
ప్రశ్న:
విద్యాప్రమాణాల విషయంలో మన విద్యావ్యవస్థలో లోపాలున్నాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది. నార్వే, స్వీడన్ లాంటి విదేశీ విద్యావ్యవస్థలనే ఉదాహరణలుగా తీసుకుంటుంటాం. ఈ కరోనా ప్రభావంతో దేశీయ విద్యారంగంలో సంస్కరణలు చేపట్టే అవకాశం ఉన్నందున్న ప్రమాణాల పెంపొందించే విధంగా ఎలా కృషిచేయవచ్చు?
జవాబు:
అలాంటి మార్పులు వ్యవస్థాగతంగా రావాలి. విద్యార్థులపైన ఒత్తిడి లేకుండా ఎలా వారిలో నైపుణ్యాలను పెంపొందించాలి అనే అంశాల్లో అక్కడి పద్ధతులు బాగున్నాయి. అవన్నీ సాధారణ పరిస్థితుల్లో ఉన్నా చర్చించాల్సిన అంశాలే. కేవలం కరోనా తీసుకువచ్చే సంస్కరణల్లో అలాంటివి ఉంటాయనుకోవటం లేదు. అదంతా పూర్తిగా వ్యవస్థీకృతమైన విద్యావిధానాల్లో విషయంలో సంస్కరణలు చేపట్టేటప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాల జాబితాలో ఉంటాయి.
ప్రశ్న:
మన దేశంలో విద్యాప్రమాణాల విషయంలో ఐఐటీలు ముందంజలో ఉంటాయి. మాములు విద్యాసంస్థలకు, ఐఐటీల్లో విద్యాబోధనలో ఎలాంటి మార్పులు ఉంటాయి?
జవాబు:
ఐఐటీలకు వచ్చే విద్యార్థులు సాధారణంగానే అత్యుత్తమ ప్రతిభ ఉన్నవాళ్లై ఉంటారు. ఐఐటీలుగా మాకున్న వ్యవస్థలను నిర్వహించుకోవటంలో మాకున్న సౌలభ్యాలు సైతం అధికం. సిలబస్ దగ్గర నుంచి విద్యాసంస్థను నడిపే వరకూ ఎక్కడ లోపాలున్నా మేం వెంటనే మార్చుకునేలా....వ్యవస్థను బలోపేతం చేసేలా సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం, స్వయం ప్రతిపత్తి ఐఐటీలకు ఉంటాయి. అందుకే ఐఐటీ కాలాలకు అనుగుణంగా వచ్చే మార్పులకు వెనువెంటనే అప్డేట్ అవుతుంటాయి. మిగిలిన విద్యాసంస్థలకు అలాంటి స్వేచ్ఛ ఉండదు. వాళ్లకుంటూ పరిమితులుంటాయి..వాటినే అనుసరించాల్సి ఉంటుంది. అదే ఐఐటీలను మిగిలిన విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా నిలబెడుతోంది.
ప్రశ్న:
మన దేశంలో విద్యార్థులకు బోధించే విషయంలో థియరీ క్లాసులపై చూపించేంత శ్రద్ధ ప్రాక్టికల్ ఓరియంటేషన్ పైన ఉండటం లేదనే వాదన ఉంది. ఈ అంశాల్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది...?
జవాబు:
వ్యవస్థాగతంగా ఉంటున్న లోపాల్లో ఇది ప్రముఖమైనది. కరోనా కారణంగా చేపట్టే సంస్కరణల్లో దీనిపై దృష్టి సారించే అవకాశం లేకపోవచ్చు కానీ మార్పు రావాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే చదువు పూర్తైన తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించే సమయంలో ప్రాక్టికల్ ఓరియంటేషన్ విద్యార్థులకు తక్కువగా ఉంటుందనేది ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. ప్రస్తుతం ఉన్న సంక్షోభంలో ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. గతంలోలానే ఆయా పరిశ్రమలు విద్యార్థుల కోసం ఇంటర్నిష్ ఇచ్చే అవకాశాలపైనా ఈ ప్రభావం కచ్చితం కనిపిస్తోంది. ఐతే విద్యార్థులు మాత్రం థియరీ, ప్రాక్టికల్ అంశాలపైనా సమానంగా పట్టు సాధించే విధంగా వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రశ్న:
ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని విద్యార్థులు ఏ విధంగా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది?
జవాబు:
ప్రతి విద్యార్థి సాంకేతికతపై పట్టుసాధించాల్సిన అవసరం ఉంది. దీనికి వాళ్లు చదువుతున్న కోర్సులతో సంబంధం లేదు. ఇండస్ట్రీ 4.0, ఇంటర్నెట్ ఆఫ్ థాట్స్, ఐఓటీ లాంటి అంశాలపైనా చదువుతో సంబంధం లేకుండా విద్యార్థులు పట్టుసాధించాల్సిన అవసరం ఉంది. ఇదివరకూ కేవలం అదే కోర్సుకు సంబంధించిన అంశాలపైనే దృష్టి సారిస్తే సరిపోదు. ప్రపంచ పరిజ్ఞానాన్ని అలవర్చుకుంటునే విద్యార్థులు మంచి ఉపాధి అవకాశాలు పొందగలుగుతారు. అలాంటి మార్పులను సిలబస్ లోనూ విద్యాసంస్థలు భాగస్వామ్యం చేయాలి.
ప్రశ్న:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్కరణల పై విద్యాసంస్థలతో చర్చలు సాగిస్తున్నాయి కదా...మీరు ఎలాంటి సలహాలను ఇస్తున్నారు...?
జవాబు:
తరగతి గదిలో 20,30 మందిని కూర్చోబెట్టమని నిబంధనలు చెబుతున్నాయి. అలా ఎంతమందినే వ్యవస్థకు పరిమితం చేయగలుగుతాం. కరోనా కేసులు పెరుగుతూ ఉంటే...వచ్చే విద్యాసంవత్సరం పూర్తిగా ఆన్ లైన్ చేయాలా....ఇప్పుడు ఐఐటీ ప్రవేశాలు సైతం ఆలస్యం అవుతున్న తరుణంలో....వారికంటూ ప్రత్యేక క్యాలండర్ రూపొందించాల్సిన అవసరం ఉందా...ఇలా చాలా విషయాలపై స్పష్టత లేదు. ఈ విషయాలనే ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాం.
ప్రశ్న:
ఐఐటీ ప్రవేశాలు మరింత ఆలస్యం అవుతున్న తరుణంలో...కెరియర్ పట్ల విద్యార్థుల్లో ఆందోళన నెలకొంటోంది. ఐఐటీ డైరెక్టర్ గా మీరు వాళ్లకి మనో ధైర్యం కల్పించేలా ఎలాంటి సలహాలను అందిస్తారు.?
జవాబు:
ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మనమెవరం ఊహించలేదు. ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లే మాట వాస్తవం. ఐతే ఉన్నత చదువుల వైపు దృష్టి సారించే వాళ్లపై అంత ప్రభావం ఉండదు. మరో ఐదారు నెలల పాటు ఎలాంటి స్పష్టత వచ్చే ఆస్కారం లేని తరుణంలో......తమలోని నైపుణ్యాల అభివృద్ధి కోసం విద్యార్థులు వినియోగించుకోవాలి. మేం కూడా వీలైనంతగా విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నాం. కొత్తగా వచ్చే వాళ్లు ధైర్యం కోల్పోకుండా తమను తాము మరింత మెరుగు పర్చుకునే అంశాలపై పట్టు సాధించాలి.
ఇవీ చదవండి: సినిమా షూటింగులకు ప్రభుత్వం అంగీకారం